రాజధానిపై ఆందోళనల్లో అర్థంలేదు


సిఎం జగన్‌ ప్రతిపాదన మాత్రమే చేశారు


కమిటీ నివేదిక వచ్చాక చూద్దామన్నారు: మంత్రి పేర్ని నాని


అమరావతి,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏం ప్రకటించారని ఇంత ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని సీఎం ప్రకటించిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు నిరసనలు, ఆందోళనలు చేస్తుండటంపై మంత్రి స్పందించారు. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానులు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. చంద్రబాబును నమ్మి మోసపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. జగన్‌ మాటిస్తే దానిపైనే నిలబడతారు. టీడీపీ నేతలు భూములు కొన్నారని రాజధాని మార్చడం లేదు. రాజధాని ప్రాంతంలో 100శాతం అక్రమాలు జరిగాయి. అక్రమార్కులను గుర్తించి అవసరమైతే జైలుకు పంపుతామని' మంత్రి వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రకటనపై కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడిలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు.


బినావిూల పేరుతో భూముల కొనుగోలు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినావిూలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని, అందుకే అమరావతి రాజధాని అంటున్నారని అనకాపల్లి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, ఆయన ప్రకటనతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. హైకోర్టు వస్తుందనడంతో


రాయలసీమ ప్రజలు ఆనందంగా ఉన్నారని.. లెజిస్లేటివ్‌ రాజధానితో అమరావతి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కింద స్థాయి వరకు అందాలని ఎలా భావిస్తామో పరిపాలన కూడా అదేవిధంగా అందాలని సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. టీడీపీ నేతలు రాజధానిలో భూములు కొన్నారు కాబట్టి వైజాగ్‌ లో వైస్సార్సీపీ నేతలు భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై అమర్‌నాథ్‌ విరుచుకుపడ్డారు


అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద కుంభకోణమని గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని, రాజధానిలో ఎకరాకు 2 వేలు ఖర్చు చేసినా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదని, అయిదు కోట్ల మంది ప్రజలు ఉంటే 1400 మంది అభిప్రాయం తీసుకొని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. రాజదాన్ని అభివృద్ధి చేస్తే రాజధానిలో లోకేష్‌ ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతి పారిపోయి వచ్చారని, చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కనీసం ఇల్లు కూడా నిర్మించుకోలేదని దుయ్యబట్టారు.అమరావతి ఉంటే చాలు మిగతా ప్రాంతాలు అవసరం లేదన్న విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఉత్తరాంధ, రాయలసీమ ప్రాంతాల ద్రోహిగా బాబు మిగిలిపోతారని మండిపడ్డారు. అంతర్జాతీయ రాజధాని అని చెప్పి అయిదు వేల కోట్లు ఖర్చు చేశారని, రాజధాని నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు పరిస్థితి ఏంటని గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ వెళ్లి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని పవనే చెప్పారు. వైజాగ్‌ కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలన రాజధానికి 300 ఎకరాలు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు దత్త పుత్రుడుగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు కానుకగా పరిపాలన రాజధాని ప్రకటనని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీలను మూసుకోవాలి. పవన్‌ మాటలకు నిలకడ లేదు. ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతాడు' అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.