నెట్టింట్లో ఉల్లిగడ్డల జోకులు


వస్తువుల అమ్మకాలకు ఉల్లిగడ్డల ఆఫర్‌


బంగారం కన్నా ఉల్లి ధరలే ఎక్కువంటూ సెటైర్లు


హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉల్లి ధరలు ఆకాశనికి ఎగబాకడంతో ఇప్పుడు వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వివిధ రంగాల్లో వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఉల్లిని ఎరగా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ సెల్‌ఫోన్‌ విక్రేత ఫోన్‌ కొంటే కిలో ఉల్లి ఉచితం అంటూ ప్రకటన చేశారు. అలాగే ఓ హైరా మార్కెట్‌ వారు 500 కొనుగోళ్లపై కిలో ఉల్లి 70 రూపాయలంటూ ప్రకటించారు. అలాగే వస్త్ర దుకాణాల వారు కూడా ఈ ఎత్తుగడలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇకపోతే ఇప్పుడు ఉల్లిధరలపై సామాజిక మాధ్యమాల్లో బోలెడు జోకులు పేలుతున్నాయి. ఆటోవాల పెద్ద ఉల్లిగడ్డ తీసుకుని చిన్న ఉల్లిగడ్డ ఇవ్వడం, అత్త కోడలుకు బీరువా నుంచి చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇవ్వడం లాంటివి చూస్తున్నాం.నెటిజన్లు


కూడా నేడు సోషల్‌ విూడియాలో ఉల్లిగడ్డలు, వాటి ధరలపై రకారకాల పోస్టులు పెట్టి వైరల్‌ చేస్తున్నారు. ఏకంగా పెళ్లి వేడుకలో పెళ్లి కుమారుడు కుమార్తెకు ఉల్లిగడ్డలను ప్యాకింగ్‌ చేసి బహుమతిగా ఇవ్వడం, ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్మెంట్‌ పద్ధతిలో ఉల్లిగడ్డలు లభిస్తాయనే ప్రకటన బోర్డులు పెట్టడం, ఆటోవాలాకు ఆటో చార్జీకి బదులుగా ఉల్లిగడ్డలను ఇవ్వడం, కోహినూర్‌ వజ్రం కంటే ఉల్లిగడ్డే విలువైనదని పోల్చడం వంటి పోస్టులు వైరల్‌ అయ్యాయి. వీటితోపాటు బహిరంగ మార్కెట్‌లో సైతం గృహిణిలు తమ ఇబ్బందులను తెలుపుతున్నారు. గత రెండు నెలలుగా ఉల్లి ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఎపి అసెంబ్లీలో సోమవారం ఉల్లి దండలతో టిడిపి ప్రదర్శన చేయడమే గాకుండా, అసెంబ్లీకి అలాగే హజరయ్యారు. మరో నెల దిటితే గాని ఉల్లి ధరలు దిగి రానంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో భారీగా వర్షాలు కురవడంతో అప్పటికే సాగులో ఉన్న ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దిగుబడి తగినంత లేకపోవడంతో మూడు నెలలుగా అంచెలంచలుగా ఉల్లి ధర పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉల్లి సాగు తిరిగి ప్రారంభం కావడంతో ఆ పంట చేతికి వచ్చే వరకు ధరల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇంట్లో కూరలు, అల్పాహారల్లో ఉల్లి గడ్డలు వినియోగించడం సర్వసాధారణం. అయితే ధరలు పెరగడంతో అన్ని వర్గాల వారికీ ఇబ్బంది ఎదురవు తోంది. ప్రస్తతం బహిరంగ మార్కెట్లో ఉల్లి నాణ్యతను బట్టి 15 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. యుద్ధప్రాతిపాదికన ఇతర రాష్టాల్ర నుంచి, దేశాల నుంచి భారీగా ఉల్లిని దిగుమతి చేస్తోంది. మొదటి రకం ఉల్లిగడ్డల ధర కేజీ రూ.150 రూ.170 మధ్య ఉంది. కొన్నేళ్లుగా ఉల్లిసాగు ఊసేలేకపోవడం, అవగాహన కల్పించినప్పటికీ రైతులు ఆసక్తి చూపకపోవడం ఇక్కడ దిగుబడి అంతగా లేదు. దీంతో ఇతర రాష్టాల్ర నుంచి నిత్యం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్ల్రోనూ ఇదే పరిస్థితి. మరో రెండు నెలలపాటు ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉంది. ఏటా ఏపీ, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ తదితర రాష్టాల్ర నుంచి భారీగా ఉల్లిగడ్డలను జిల్లా వ్యాపారులు దిగుమతి చేసుకుంటు న్నారు. కర్ణాటక, రాజస్తాన్‌ రాష్టాల్ర నుంచి సైతం పరిస్థితులను బట్టి దిగుమతి చేసుకుం టుంటారు. తెలుగు రాష్టాల్ల్రో ఉల్లిసాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ఐదేళ్లుగా రాష్ట్ర ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖ అనేక ప్రయత్నాలు చేసింది. రెండేళ్ల క్రితం ఆసక్తి కలిగిన ఉద్యాన రైతులకు అధికారులు హైదరాబాద్‌లో ఉల్లిసాగుపై అవగాహన సైతం కల్పించారు. అనంతరం ప్రభుత్వం ఉచితంగానే ఉల్లి విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. అయితే ఆ ఏడాది మాత్రమే కొందరు రైతులు సాగు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఉల్లి సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే ఇతర రాష్టాల్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అదునుగా ఉల్లిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యాపారులపై నిఘా పెట్టింది. ఇతర రాష్టాల్ర నుంచి 500 మెట్రిక్‌ టన్నులను తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బ్రెజిల్‌, టర్కీ, ఈజిప్టు దేశాల నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేస్తోంది. ఇవన్నీ మార్కెట్లోకి వస్తే తప్ప ఉల్లి ధరలు దిగేలా లేవు.