ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కార్యాలయాల్లోనూ సిబిఐ తనిఖీలు
గుంటూరు,డిసెంబర్31(జనంసాక్షి) : మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఉదయం 6:30 గంటల నుంచి రాయపాటి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు. రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 500 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రుణంగా తీసుకుంది. రుణం చెల్లించక
పోవడంతో కంపెనీపై ఇండియన్ బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాయపాటి నివాసంతో పాటు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సీఈవో నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఆయన నివాసంలో లేరు. ఆయన కుమారుడు రంగబాబుతో అధికారులు మాట్లాడి సోదాలు చస్తున్నారు. విశాఖ నుంచి ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం గుంటూరుకు వచ్చింది. పోలవరంనిర్మాణాలనుకూడా ఈ కంపెనీ మధ్యలోనే వదిలేసింది. అలాగే అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది.