ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కానుక
న్యూఢిల్లీ,డిసెంబర్18(జనంసాక్షి): ఢిల్లీలో ఓటర్లుగా ఉన్న లాయర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కానుక ఇచ్చింది. న్యాయవాదులకు రూ.5 లక్షల వరకు వైద్య బీమా కల్పించనున్నట్లు ఇవాళ సీఎం అరవింద్ కేజీవ్రాల్ తెలిపారు. లాయర్లకు రూ. 10 లక్షల జీవిత బీమా కూడా కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. కోర్టు ఆవరణల్లో ఈ-లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 50 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ నిధులను ఎలా వాడాలన్న దానిపై కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ఆమోదించినట్లు సీఎం చెప్పారు. తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల గురించి ఆయన స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయం ఉన్నవాళ్లే ఆ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.