జార్ఖండ్‌లో మొదలైన మూడోదశ పోలింగ్‌


భారీగా బందోబస్తు ఏర్పాట్లు


రాంచీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటింగ్‌ జరగనున్న 17 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు మొత్తం 40 వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నరని ఆ రాష్ట్ర చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ వినయ్‌ కుమార్‌ వెల్లడించారు. 32 మంది మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 309 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు. రాంచీ, హతియా, కాన్కే, జర్కతా, రామ్‌గర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా మిగతా సమస్యాత్మక నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. జార్ఖండ్‌ అసెంబ్లీకి మొత్తం ఐదు విడతలుగా ఎన్నికల నిర్వహణ జరగుతున్న విషయం తెలిసిందే.