'మా' డైరీ రిలీజ్‌ కార్యక్రమం రసాభాస


హీరో రాజశేఖర్‌కి వార్నింగ్‌ ఇచ్చిన చిరంజీవి


క్షమాపణలు కోరిన జీవిత


హైదరాబాద్‌,డిసెంబర్‌ 2 జనం సాక్షి  : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. హీరో రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండే మెగాస్టార్‌ చిరంజీవి సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజశేఖర్‌పై సీరియస్‌ అయ్యారు. పరిస్థతి తీవ్రతను అంచనావేసిన జీవిత స్టీజీపైనే రాజశేఖర్‌ తరపున క్షమాపణలు కోరారు. వివరాల్లోకి వెళితే..  'మా' డైరీ ఆవిష్కరణలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ¬టల్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి మనందరం కలిసి 'మా' అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. హీరో రాజశేఖర్‌ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్‌ లాక్కున్నారు. అంతేకాకుండా సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. 'మా'లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మార్చిలో 'మా' కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. 'మా' కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్‌ అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. కానీ, ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. 'మా'లో గొడవలున్నాయి. రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు' అని చెప్పారు.


దీంతో అసంతృప్తికి గురైన చిరంజీవి.. నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్‌ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం లేకుండా ఇలా మైక్‌ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. విూరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. దయచేసి దీనిని వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇలాంటప్పుడు ఇష్టం లేకపోతే రాకూడదు. ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు.


అనంతరం వేదికపైకి వచ్చిన జీవిత క్షమాపణలు తెలిపారు. ''అందరం కలిసి 'మా'ని మరింత గొప్పస్థాయికి తీసుకువెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.'మా' కార్యవర్గంలో సభ్యురాలినైనప్పటి నుంచి నేటి వరకూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎందరో గొప్ప నటీనటుల వల్లే నేను ఎన్నో నేర్చుకున్నారు. అందరిలాగానే మాలో కూడా కొన్ని విబేధాలున్నాయి. గొడవలు రావడం సహజం. రాజశేఖర్‌, నేను 'మా'ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలనుకున్నాం. ఆయన చిన్నపిల్లాడు లాంటివాడు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన అలా మాట్లాడినందుకు  క్షమించమని నేను కోరుతున్నాను. విబేధాలున్నా సరే డైరీ విడుదల కార్యక్రమాన్ని అందరూ కలిసి చేయాలని మెగాస్టార్‌ 


చెప్పారు. నరేష్‌, రాజశేఖర్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా మేమందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం' అని జీవిత చెప్పారు.   


కేసీఆర్‌ సహకారం అందిస్తామన్నారు...


అంతకుముందు చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారన్నారు. సినిమా ఇండస్టీక్రి సంబంధించిన అన్ని వివరాలను మా డైరీలో పొందుపరిచారని, ఈ ఏడాది రెండు, మూడు ఈవెంట్లు చేయాలని సూచించారు. నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌లతోపాటు ఇతర యువ కథానాయకులతో మాట్లాడతానని, వాళ్లు కూడా  ఈవెంట్లు కోసం ఒప్పుకుంటారన్నారు.  సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆరే స్వయంగా చెప్పారు. కాబట్టి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో మనం చర్చించుకుందాం. ఆయనకు చెబుదాం.. అని చిరంజీవి అన్నారు.