మున్సి'పోల్స్‌'షెడ్యూల్‌ చట్ట విరుద్ధం


రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారా..?


హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి


హైదరాబాద్‌,డిసెంబర్‌ 2 జనం సాక్షి  : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబరు 23న జారీ చేసిన ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే జనవరి 7 నుంచి ఎన్నికల పక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూలు విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సదరు నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, సవరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. విచారణ ముగిసే వరకు ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.


'మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిశాక మున్సిపల్‌ చట్ట సవరణతోపాటు వార్డుల విభజన, వర్గీకరణ నిమిత్తం గత ఏడాది జులై 7న ప్రభుత్వం(జీవో 78) తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన జరిగిందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలవగా..దాన్ని రద్దు చేస్తూ కోర్టు నవంబరు 29న ఉత్తర్వులు జారీ చేసింది. వారంలోగా అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించాలని కమిషనర్లను ఆదేశించింది.


కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డిసెంబరు 3 నుంచి 9 వరకు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి, 16లోగా పరిష్కరించాలని పురపాలక శాఖ సంచాలకుడు ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే డిసెంబరు 17న తుది నోటిఫికేషన్లు జారీ చేశారు. అందుకు అనుగుణంగా 10 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, 12 మున్సిపాలిటీలలో డిసెంబరు 31 నుంచి జనవరి 4లోగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలంటూ రాష్ట్ర 


ఎన్నికల సంఘం డిసెంబరు 23న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాంతోపాటు జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యేలా షెడ్యూలునూ విడుదల చేసింది.


'షెడ్యూలు విడుదల నాటికి ఓటర్ల జాబితా కూడా తయారు కాలేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ప్రస్తావనా లేదు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 6,7లకు విరుద్ధం. పత్రికల సమాచారం మేరకు ఈ నెల 5, 6 తేదీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. 7న నోటిఫికేషన్‌ జారీ అయితే రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం ఉండదు. అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడమూ సాధ్యం కాదు' అని పిటిషనర్‌ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, సంచాలకుడు, ఎన్నికల సంఘాలను పేర్కొన్నారు.