ఆధారాల్లేవు..

- నయీం కేసులో పోలీసు అధికారులకు 'సిట్‌' క్లీన్‌చిట్‌
హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ లభించింది. 25 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు సుపరిపాలన వేదిక రాసిన లేఖకు సిట్‌ సమాధానం ఇచ్చింది. నయీంకు సహకరించినట్లు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై సాక్ష్యాధారాలు లభించకపోవడంతో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు సిట్‌ పేర్కొంది. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లకు క్లీన్‌చిట్‌ లభించింది. నయీం కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాశారు.