దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్), పరీక్షించడం (టెస్టింగ్), వైద్యం అందించడం (ట్రీట్మెంట్) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. పరీక్షలు ఎక్కువగా చేసి కరోనాను త్వరగా గుర్తించడం వల్ల మరణాల రేటును తగ్గించగలిగామని కేంద్రం వెల్లడించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా దాదాపు 7.90 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. అంటే ప్రతి మిలియన్‌కు దాదాపు 57వేల టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 65,49,373 కేసులు నమోదు కాగా.. 55లక్షల మందికిపైగా కోలుకున్నారు 9.37లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 1,01,782 మంది మృతి చెందగా.. మరణాల రేటు 1.56శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 11 రోజుల్లో కరోనా కేసుల ఉద్ధృతి కాస్త తక్కువగానే ఉంది. అదే సమయంలో భారీగా పరీక్షలను నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. జనవరిలో మొదటి కొవిడ్19 నమూనాను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించారు. కొత్తగా కేసు బయటపడినప్పుడు టెస్టులు చేసేందుకు కేవలం ఒకే ఒక ల్యాబ్ మాత్రమే భారత్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 1,751 ల్యాబుల్లో రోజుకు లక్షల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. లాక్డౌన్ సమయంలో కేసులు తక్కువగా నమోదైనప్పటికీ.. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం నుంచి కేసులు భారీగా పెరిగిపోయాయి. అయితే గత పది రోజులుగా కేసుల పెరుగుదల కాస్త నెమ్మదించడం, కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశమే. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయని కేంద్రం వివరించింది.