బీహార్‌ మహాకూటమి సీట్ల సర్దుబాటు

- ఆర్జేడీ 144.. కాంగ్రెస్‌ 70 
పట్నా,అక్టోబరు 3(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. ఈ మేరకు కూటమి నేతలు శనివారం విూడియా సమావేశంలో అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సీట్ల పంపకంలో భాగంగా మొత్తం 243 స్థానాలకు గానూ ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాలకు అభ్యర్థులను పోటీలో నిలబెట్టనుంది. సీపీఎం నాలుగు, సీపీఐకి ఆరు స్థానాలను కేటాయించారు. సీపీఐ-ఎంఎల్‌కు 19 సీట్లు కేటాయించారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ఆర్జేడీ కోటా సీట్లలో పోటీ చేయనుంది.మరోవైపు ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తికాలేదు. భాజపా- జేడీయూ చెరిసగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భాజపా కోటాలో ఎల్‌జేపీ, జేడీయూ కోటాలో జితన్‌ రాం మాంఝీ పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7 తేదీల్లో పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితాలు వెలువడనున్నాయి.