- బాధిత కుటంబాలను పరామర్శించిన రాహుల్ ప్రియాంక
దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):హాథ్రస్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లకార్డులు చేతబూనీ అధికసంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధిత కుటుంబసభ్యులను శనివారం రాహుల్ ప్రియాంకలు బాధితుల స్వగ్రామమైన బూల్‌గదికి చేరుకుని బాధిత కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకు న్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామం వెలుపల మోహరిం చారు. కట్టుదిట్టమైన పోలీసుల బందోబస్తు నడుమ వారు గ్రామంలోని బాధిత నివాసానికి చేరుకున్నారు. హాథ్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కాపాడే బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనని రాహుల్ వెల్లడించారు. అదేవిధంగా ప్రియాంకగాంధీ మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
అయితే, అంతకుముందు యూపీలోకి ప్రవేశిస్తుండగా మార్గమధ్యంలో డీఎన్డీ ఫ్లైవేపై హైడ్రామా నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా అది స్వల్ప లాఠీఛార్జికి దారి తీసింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జికి వ్యతిరేకంగా ప్రియాంకగాంధీ ప్రతిఘటించారు. ఓ కార్యకర్తను లాఠీఛార్జీ నుంచి తప్పించేందుకు స్వయంగా తానే తోపులాటలోకి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. హాథ్రస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఎవరి మృతదేహాన్ని ఖననం చేశారో చెప్పండి..
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్స పొందుతూ యువతి మృతిచెందిన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు రెండురోజులుగా గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే ఈ రోజు విూడియాను అనుమతించగా యువతి కుటుంబసభ్యులు విూడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. 'నా కూతురిని చూపించాలని ప్రాధేయపడినా ఎవరూ కనికరం చూపలేదు. సీబీఐ దర్యాప్తు కూడా మాకు అక్కర్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఏర్పాటైన బృందం కేసు దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం' అని అన్నారు. ఎలాంటి అబద్ధాలు ఆడటం లేదని, నార్కో పరీక్షలకు హాజరుకాబోమని ఆమె స్పష్టం చేశారు.బాధితురాలి వదిన విూడియాతో మాట్లాడుతూ.. 'పోలీసులు ఎవరి మృతదేహాన్ని ఖననం చేశారో ముందుగా స్పష్టం చేయాలి. మాకు ఆమెను చూపించలేదు' అని వెల్లడించారు. 'మేమెందుకు నార్కో పరీక్షలకు హాజరుకావాలి. మేము నిజమే చెబుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. అబద్ధాలు మాట్లాడుతున్న జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ నార్కో పరీక్షలకు హాజరుకావాలి' అని డిమాండ్ చేశారు. బాధితురాలి అంతిమసంస్కారాల సమయంలో ఆమె తాతయ్య అక్కడే ఉన్నారు అనే ఆరోపణలను ఆమె కొట్టివేశారు. యువతి తాతయ్య 2006లోనే మృతిచెందాడని ఖననం సమయంలో ఆయనెలా ఉంటారని ఆరోపించారు.'సిట్‌కు చెందిన ఏ అధికారి కూడా నిన్న విచారణ కోసం మా ఇంటికి రాలేదు. మొన్న ఉదయం 9గంటలకు వచ్చి మధ్యాహ్నం 2.30గంటల వరకు ఉన్నారు. యువతికి కరోనా సోకి మృతిచెంది ఉండవచ్చేమోనని జిల్లా మెజిస్ట్రేట్ ఆరోపిస్తున్నారు. అలాంటి అసత్య ఆరోపణలతో మరింత కుంగిపోయాం. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. మా అమ్మాయి మృతదేహాన్ని మాకెందుకు చూపించలేదు. సిట్ విూద మాకు నమ్మకం లేదు' అని పేర్కొన్నారు. దళిత యువతి హత్యాచార ఘటనపై దర్యాప్తు, నిబంధనలు ఉల్లంఘించి యువతికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హాథ్రస్ సూపరింటెండెంట్ సహా మరో నలుగులు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈనేపథ్యంలోనే జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్‌ను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.