దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్ సాయుధ కమెండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు ఈ భద్రత ఉండనుంది. గతంలో దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. అయితే, 2019 నవంబర్‌లో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన వీఐపీ భద్రతా విభాగం నుంచి ఆయనకు కమాండోలతో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 8 మంది నుంచి 12 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలతో కూడిన మొబైల్ టీం ఆయనకు నిరంతరం భద్రతగా ఉండనుంది.