ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు



దిల్లీ జనవరి 21 (జనం సాక్షి):  

 రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు అనుమతులు లభించడంతో..జనవరి 16 నుంచే దేశంలో మొదటి దశ టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 50ఏళ్లు పైడిన ప్రజాప్రతినిధులకు రెండో దశలో టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని స్వయంగా సీఎంల భేటీలో ప్రస్తావించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నారు. సుమారు మూడు కోట్ల మంది దాకా ఉన్న ఈ సిబ్బందికి టీకా పంపిణీ ముగిసిన అనంతరం రెండో దశ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండో దశ  ప్రారంభించిన తొలిరోజే ప్రధాని నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 7.86 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం నాడు 20 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,12,007 మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. అయితే, ఐదో రోజున వ్యాక్సినేషన్‌లో 82 కేసుల్లో ప్రతికూల ప్రభావాలు కనిపించినట్లు పేర్కొంది.