తేజస్‌ జెట్లు రాక..

 



- 83 ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు ఆమోదముద్ర

దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ (ఎల్‌సీఏ - లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.రానున్న రోజుల్లో ఎల్‌సీఏ తేజస్‌ ఫైటర్‌ జెట్‌లు భారత వాయుసేనను పటిష్టం చేయనుందని రాజ్‌నాథ్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. మొత్తం జెట్‌లలో 73 తేజస్‌ ఎంకే-1ఏ ఫైటర్‌ జెట్‌లు, 10 తేజస్‌ ఎంకే-1ఏ శిక్షణా జెట్‌లు. ఈ జెట్‌లలో పెద్ద సంఖ్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. తేజస్‌ విమానాలను హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ తయారుచేస్తున్న విషయం తెలిసిందే.