- ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుంది
- భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరిక
దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో కొనసాగడం కష్టమని ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇప్పటి వరకు కేవలం సాగుచట్టాలను మాత్రమే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని, ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుందని భారతీయ కిసాన్ సంఘం(బీకేయూ) పేర్కొంది. రైతు సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని 'మహాపంచాయత్' పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.'ఇప్పటి వరకు 'బిల్ వాస్‌సీ'(సాగు చట్టాల రద్దు) గురించే మాట్లాడాం. ఈ అంశాన్ని ప్రభుత్వం శ్రద్ధగా వినాలి. ఒకవేళ యువత 'గద్దీ వాప్‌సీ'(అధికారం నుంచి దిగిపోవడం)కి పిలుపునిస్తే విూరేం చేస్తారు? అని భారతీయ కిసాన్ సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే మూడు సాగు చట్టాలను రద్దుచేసి, కనీస మద్దతు ధరపై కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం రహదారులపై ముళ్ల కంచెలు, మేకుల ఏర్పాట్లపై స్పందించిన ఆయన, రాజు భయపడినప్పుడే, కోటను రక్షించుకునేందుకు చర్యలు చేపడతాడని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.ఇప్పటికే తాము చేస్తోన్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా గ్రామాల పెద్దల నుంచి భారీ మద్దతు లభిస్తోందని బీకేయూ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో యువత కూడా ఈ ఉద్యమంలో పాల్గొని శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసింది.ఇదిలాఉంటే, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా చేస్తోన్న రైతుల ఆందోళనలపై పార్లమెంటులో చర్చించాలని విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. దీంతో రైతు సమస్యలపై 15గంటల పాటు చర్చించేందుకు అటు ప్రభుత్వం, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది.