అభ్యర్థులను మీరే గెలిపించాలి

 



- లక్షా 32 ఉద్యోగాలను భర్తీ చేశాం

- మంత్రికేటీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 24 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. భర్తీ విషయంలో తాను చెప్పింది సరైంది కాదని ఎవరైనా భావిస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్‌ చెప్పారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో నేరుగా, క్రమబద్ధీకరించినవి కలిపి మొత్తంగా 1,32,799 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. వాటిలో 36వేలకు పైగా ఉద్యోగాలు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా చేపట్టినట్లు చెప్పారు. మరో నాలుగు వేల ఉద్యోగాల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగించినప్పటికీ కోర్టు వివాదాల కారణంగా అవి వాయిదా పడినట్లు కేటీఆర్‌ వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఒక్క తెరాస ప్రభుత్వమేనన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీల అభ్యర్థులకు లేవని.. ఆమె విజయానికి కృషి చేయాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. విభజన హావిూలు నెరవేర్చని భాజపాకు మనం ఓటు వేయాలా?లేదా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్‌ అన్నారు. జీడీపీ పెంచుతామని చెప్పిన కేంద్రం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతుందని చురకలు అంటించారు. ఇవాళ పెద్దఎత్తున తెరాసపై దుష్ప్రచారం చేస్తున్న భాజపా నేతలు,, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకొచ్చారా? న్యాయవాదులు, పట్టభద్రులకు ఏమైనా చేశారా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఏడేళ్లుగా ఎన్ని సృష్టించగలిగారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మతాల పేరుతో రాజకీయం చేయకుండా జనహితం కోసం చేయాలని హితవు పలికారు. ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రగతికి ఏవిూ చేయని భాజపాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఐటీఐఆర్‌ను భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసిందని.. అలాంటి పార్టీకి యువత ఎందుకు ఓటేయాలని కేటీఆర్‌ ప్రశ్నించారు.