సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
అవి వక్ఫ్ భూములే ధరణి
సర్కారుపై మంత్రి సమరం
వక్ఫ్ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత భూముల జాబితాలోకి ఎక్కిన భూమి
తన భూములు 'ధరణి' నిషేదిత జాబితాలో ఉండటంతో హైకోర్టును ఆశ్రయించిన మంత్రి గంగుల కమలాకర్
సదరు భూమిని వక్ఫ్ భూముల జాబితా నుంచి తొలగించేలా వక్ఫ్ బోర్డుకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో గంగుల కమలాకర్ పిటిషన్
సామాన్యులకు 'ధరణి' ఇస్తున్న భరోసాకు ఈ ఉదంతం ఓ తార్కాణం
(నర్మాల పరంధాములు/కరీంనగర్ బ్యూరో)
సాధారణ ప్రజల భూయాజమాన్య హక్కులకు సైతం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే సదాశయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ధరణి' తన పని తాను చేసుకుంటూ పోతుంది. భూయాజమాన్య హక్కులు కోరుతున్నది మాన్యులా, సామాన్యులా అని చూడకుండా నమోదైన అధికారిక భూ రికార్డుల ప్రకారమే నిష్పక్షపాతంగా ముందుకు వెళుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అనుభవాన్ని చెప్పుకోవచ్చు. వివరాలలోకి వెళితే... కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెం.126లో 15.26 ఎకరాల వ్యవసాయ భూమిని 2008 సంవత్సరంలో కొన్నారు. అట్టి భూమికి పూర్తి హక్కుదారుగా భావిస్తున్న సయ్యద్ హవిూదుద్దీన్ వద్ద నుంచి రాచకొండ కుటుంబీకులు చేయగా, వారి నుంచి గంగుల కమలాకర్ కొనుగోలు చేశారు. 2012లో పట్టాదారు పాస్‌పుస్తకం కూడా జారీ అయిందని చెబుతున్నారు. కానీ ఆ భూమి తమదేనని వక్ఫ్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 15.26 ఎకరాలను వక్ఫ్ భూములుగా పేర్కొంటూ గతంలో కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ 2014లోనే గంగుల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ యాక్టులోని 22ఏ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ 2020 మే 8న కరీంనగర్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ కారణంగా 'ధరణి'లో సదరు భూమికి సంభందించిన ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలు లేకుండా అయింది. దీనితో మే 8న జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, మైనారిటీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులకు, వక్ఫ్‌బోర్డు, కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, కొత్తపల్లి తహసీల్దారులకు మంగళవారం నోటీసులు జారీచేశారు. విచారణను మార్చి 23కి వాయిదా వేశారు. ఏదిఏమైనా సామాన్యులకు 'ధరణి' ఇస్తున్న భరోసా కారణంగా భవిష్యత్తులో కొత్త భూవివాదాలు తలెత్తే10అవకాశాలు చాలా తక్కువ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.