ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి

నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం
లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి
నీట మునిగిన సరికొండ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌
నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో నిజామాబాద్‌ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో వచ్చి చేరు తోంది. ఫలితంగా మంజీరా నదిలో ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. తెలంగాణ మహారాష్ట్రల ను కలిపే అంతర్రాష్ట్ర బ్రిడ్జిని కూడా గోదావరి ప్రవాహం ముంచేయడంతో స్థానిక ప్రజలు భయాందోళన లకు గురవుతున్నారు. ఇప్పటికే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని చాలా పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భీంగల్‌ మండలంలో గ్యాస్‌ సిలిండర్‌ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి విూద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నారు. స్థానికుల సహకారంతో వరద ప్రవాహంలో చిక్కుకున్న వాహనం, డ్రైవర్‌ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, భారీ వర్షాలు కురుస్తుంన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌ చెరువు అలుగు ప్రవాహంలో వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పందిరి భగవంత్‌ రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి లింగాపూర్‌కు వెళుతున్నాడు. లింగాపూర్‌ చెరువు అలుగు పారుతున్నప్పటికీ దాటే ప్రయత్నం చేయడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భగవంత్‌ రెడ్డి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.పలు చోట్ల రోడ్లు తొగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. జిల్లాలోని సిరికొండ మండలం సబ్‌ స్టేషన్‌ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్‌ స్టేషన్‌ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు.రాత్రి నుంచి పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. సబ్‌ స్టేషన్‌లో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఎన్పీడీసీఎల్‌ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.