రైతుల బంద్‌కు రాహుల్‌ మద్దతు


అన్ని పార్టీల మద్దతుతో కొనసాగుతున్న బంద్‌

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు సోమవారంనాడు ఇచ్చిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతులు చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం నేటికీ యథాతథంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం వంచనకు పాల్పడుతూనే ఉన్నందున రైతులు భారత్‌ బంద్‌కు దిగారని పేర్కొన్నారు. ‘రైతులకు బాసటగా ఉంటాను‘ అని రాహుల్‌ ఓ ట్వీట్‌లో ప్రకటించారు.
సాగు చట్టాలను కేంద్ర ఆమోదించి ఏడాదైన సందర్భంగా ఆ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్‌ మోర్చా ’భారత్‌ బంద్‌’కు పిలుపునిచ్చింది. భారత్‌ బంద్‌కు సీపీఎం, సీపీఐ, ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ (సెక్యులర్‌), బహుజన్‌ సమజ్‌ పార్టీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, డీఎంకే, సాద్‌`సంయుక్త్‌, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ, జార్ఖాండ్‌ ముక్తి మోర్చా, రాష్టీయ్ర జనతా దళ్‌, సర్వాజ్‌ ఇండియా తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు. బంద్‌కు 500కు పైగా రైతు సంస్థలు, 15 ట్రేడ్‌ యూనియర్లు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బంద్‌ కొనసాగనుంది.