ఉచిత విద్యకు బలమైన పునాదులు

ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణ

వరంగల్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)     :  తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న కేజీ టు పీజీ పథకానికి రూప మివ్వలేకపోయినా విద్యారంగంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గురుకుల విద్యను బలోపేతం చేయడంతో సామాన్యులకు చదువు చేరువయ్యింది. కార్పోరేట్‌ దోపిడీ నుంచి ప్రజలు తమ పిల్లలను బయటకు రప్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఇటీవల కరోనాతో చితికి పోయిన ప్రజలు తిరిగి తమ పిల్లలను మళ్లీ ప్రభుత్వ బడులకు పంపుతున్నారు. ఉచిత విద్యకోసం బలమైన పునాదులు పడుతున్నాయనే చెప్పాలి. ఇప్పటిదాకా 489 గురుకుల పాఠశాలలు, 31 డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలను ప్రారంభించింది. ఈ ఏడాది పాఠశాలల్లో 5,6,7 తరగతులకు, డిగ్రీ గురుకులాల్లో ఫస్టియర్‌కు అడ్మిషన్లు నిర్వహించింది. ఇకపై ఏటా పాఠశాలలు కళాశాలల సంఖ్యతోపాటు తరగతుల అప్‌గ్రెడేషన్‌ జరుపుతూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వచ్చే రెండేండ్లలో పీజీ వరకు ఉచిత విద్య పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాణ్యమైన విద్యతో ఉద్యోగులుగా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దినప్పుడే ఆ వర్గాల అభ్యున్నతి సాధ్యమని కేసీఆర్‌ విశ్వసించారు. ఈ మేరకు భారీ సంఖ్యలో రెసిడెన్సియల్‌ స్కూళ్లను ప్రారంభించారు. పాఠశాలల ద్వారా మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇంతకాలం సరైన విద్యకు నోచని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు ఉత్తమ విద్యకు మార్గం సుగమం అయ్యిందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అఅభిప్రాయపడ్డారు. నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా లభించిందని కడియం గుర్తు చేశారు. మరో రెండేండ్లలో రెసిడెన్షి యల్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థుల కోసం పీజీ కాలేజీలు ఏర్పాటు అవుతాయని అన్నారు. గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్న అన్నిరంగాల్లో రాణించడానికి అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్వప్నం కేజీ టు పీజీ విద్యాపథకం అమలుకు ఓ రకంగా ఇది కార్యాచరణగా భావించాలన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య పాఠ్యాంశం కావాలని ఆయన అభిలషించారు. ఇలా చేయాలని గతంలో తాను విద్‌ఆయమంత్రిగా కృషి చేసానని అన్నారు. ఇది విద్యార్థి, ఉపాధ్యాయులకు తప్పనిసరి కావాలని అన్నారు. మొక్కలు పెంచడంలో ప్రైవేట్‌,ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములు కావడం అవసరమని అన్నారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దవైతే మానవాళి మనుగడకు దోహదపడతాయని,భవిష్యత్‌కు నీడనిస్తాయని అన్నారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికే విధంగా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ విద్యాముఖచిత్రంలో మార్పులు రానున్నాయని అన్నారు. ఇటీవల సివిల్స్‌లో కొందరు రాణించడం అన్నది మన విద్యారంగంలో వస్తున్న మార్పులకు కారనంగా చూడాలన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే విద్యార్థులు ముందుకు వెళ్లగలరని అన్నారు.
````````````````