` సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు!
కేప్ కెనెరవాల్,సెప్టెంబరు 19(జనంసాక్షి): పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నారు. శనివారం ఉదయం ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్రంలో క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పూర్తిస్థాయి సుశిక్షితులైన వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరులు ఇలా రోదసిలోకి వెళ్లడం ఇదే తొలిసారి. అపర కుబేరుడు జేర్డ్ ఇజాక్‌మన్ నేతృత్వంలో ఈ రోదసి యాత్ర సాగింది.
యాత్ర సాగిందిలా..
మానవసహిత రోదసి యాత్రల్లో ఇదొక కొత్త అధ్యాయం. దీంతో అంతరిక్ష పర్యాటకం దిశగా ముందడుగు పడిరది. ఈ యాత్రతో స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా కోట్ల డాలర్ల విలువైన అంతరిక్ష పర్యాటక వ్యాపారంలోకి దిగారు. ‘ఇన్‌స్పిరేషన్4’ పేరిట ఈ రోదసియాత్ర సాగింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌక నింగిలోకి వెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించింది. అంతిమంగా ఇది భూమికి 575 కిలోవిూటర్ల ఎత్తులోకి చేరింది. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) ఉన్న కక్ష్య కన్నా 160 కిలోవిూటర్లు ఎక్కువ ఎత్తు కావడం గమనార్హం. హబుల్ టెలిస్కోపు ఉన్న ప్రాంతాన్నీ ‘క్రూ డ్రాగన్’ దాటివెళ్లింది. అక్కడ గంటకు 27,360 కిలోవిూటర్ల వేగంతో 90 నిమిషాలకోసారి భూమిని చుట్టింది. ఇది ధ్వని కన్నా 22 రెట్లు ఎక్కువ వేగం. మొత్తవ్మిూద వ్యోమగాములు మూడు రోజుల పాటు భూ కక్ష్యలో గడిపారు. యాత్ర అనంతరం వీరి వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగారు. వెంటనే సహాయ సిబ్బంది వీరిని.. సవిూపంలోని ఒక నౌకలోకి చేర్చారు. నలుగురు యాత్రికులు స్పేస్‌ఎక్స్ వద్ద ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. డ్రాగన్ వ్యోమనౌక నియంత్రణ మొత్తం అందులోని కంప్యూటర్ వ్యవస్థలే నిర్వహించాయి. దీన్ని నేలపై నుంచి స్పేస్‌ఎక్స్ సిబ్బంది పర్యవేక్షించారు. క్రూ డ్రాగన్ కాప్స్యూల్ సాధారణంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను తీసుకెళుతుంటుంది. దానికన్నా ఎత్తులో ‘ఇన్‌స్పిరేషన్4’ యాత్ర సాగాలన్న ఇజాక్‌మన్ విజ్ఞప్తిని తొలుత స్పేస్‌ఎక్స్ తోసిపుచ్చింది. భద్రతపరమైన సవిూక్ష తర్వాత విజ్ఞప్తిని మన్నించింది. ఈ యాత్రకైన వ్యయాన్ని ఆయనే భరించారు.
గాజు కిటికీ నుంచి అద్భుత వీక్షణ..
క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానం కావడానికి ఏర్పాటుచేసిన డాకింగ్ వ్యవస్థలను తొలగించి, గుమ్మటం ఆకారంలో ఒక గాజు కిటికీని అమర్చారు. దాని ద్వారా.. రోదసిని చూడొచ్చు. కక్ష్యలోకి చేరాక ఈ కిటికీపై ఉన్న తలుపు తెరుచుకుంది. దాని నుంచి వీక్షణ అద్భుతంగా ఉందని ఇజాక్‌మన్ పేర్కొన్నారు. ఈ యాత్రలో వైద్యపరమైన అనేక ప్రయోగాలను నిర్వహించారు. యాత్రికుల నుంచి బయోమెడికల్ డేటా, నమూనాలు, అల్ట్రాసౌండ్ స్కాన్‌లను సేకరించనున్నారు. ఈ వివరాలను భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం ఉపయోగిస్తారు.
యాత్రికులు వీరే..
ఇజాక్‌మన్ (38): ‘షిఫ్ట్4 పేమెంట్స్’ అనే చెల్లింపుల ప్రాసెసింగ్ కంపెనీని ఆయన నిర్వహిస్తున్నారు. పైలట్‌గానూ శిక్షణ పొందారు. ఈ యాత్రకు ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో రోదసిలోకి వెళ్లిన మూడో బిలియనీర్‌గా ఆయన గుర్తింపు పొందారు. జులైలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్ అధిపతి జెఫ్ బెజోస్‌లు చిన్నపాటి రోదసియాత్రలు చేశారు.
హేలీ ఆర్సినో (29): చిన్నతనంలో ఎముక క్యాన్సర్ బారినపడ్డారు. టెన్నెసీ రాష్ట్రంలోని సెయింట్ జూడ్ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె.. ఇదే ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. రోదసిలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కురాలిగా, కృత్రిమ అవయవంతో అంతరిక్ష యాత్ర చేస్తున్న తొలి వ్యక్తిగా హేలీ గుర్తింపు పొందనున్నారు. రోదసి నుంచి తన ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడాలని ఆమె భావిస్తున్నారు. ఈ ఆసుపత్రికి సొంతంగా 10 కోట్ల డాలర్లు ఇస్తానని ఇజాక్‌మన్ హావిూ ఇచ్చారు. విరాళాల రూపంలో మరో 10 కోట్ల డాలర్లు సవిూకరిస్తానన్నారు.
క్రిస్ సెంబ్రోస్కి (42): ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అమెరికా వైమానిక దళంలో పనిచేశారు. ఆయన కూడా సెయింట్ జూడ్ ఆసుపత్రికి విరాళమిచ్చారు. తద్వారా ఆయన ఇన్‌స్పిరేషన్4 బృందంలో నాలుగో సీటుకు నిర్వహించిన లాటరీకి అర్హులయ్యారు. నిజానికి ఈ లాటరీని క్రిస్ గెలవలేదు. ఆయన స్నేహితుడిని అదృష్టం వరించింది. అయితే ఆయన తప్పుకొని, క్రిస్‌కు అవకాశం కల్పించారు.
సియాన్ ప్రాక్టర్ (51): జియో సైంటిస్ట్, ఆర్టిస్ట్, సైన్స్ రచయిత్రిగా ఆమె వ్యవహరిస్తున్నారు. 2009లో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) నిర్వహించిన వ్యోమగామి ఎంపిక కార్యక్రమంలో తుది రౌండ్ వరకూ చేరుకోగలిగారు. చివర్లో ఆమె ఎంపిక కాలేకపోయారు. ‘ఇన్‌స్పిరేషన్4’ యాత్రలో ఆమె పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. తద్వారా వ్యోమనౌకకు పైలట్‌గా వ్యవహరించిన తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు.
స్పేస్‌ఎక్స్ రోదసి యాత్ర విజయవంతం