జిల్లాలో దాదాపు 500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

 

విద్యావంలంటీర్ల పోస్టులతోనే సాగనున్న చదువులు
ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్న అధికారులు
నిజామాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : జిల్లాలో దాదాపు 500ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో గతంలో వలంటీర్లను నియమించారు. ఇప్పుడ స్కూళ్లు తెరిచాక వలంటీర్లను తీసుకోక పోవడంతో బోధన సమస్యగా మారింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సుమారు 15నెలల పాటు మూసి ఉన్న పాఠశాలల ఎట్టకేలకు పునఃప్రారంభయ్యాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగా.. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం పాఠశాలలను ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో 1,100ల మంది విద్యావలంటీర్లు పనిచేశారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా వారిని రెన్యూవల్‌ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులను వచ్చే విద్యాసంవత్సరం కూడా కొనసాగించే విషయంలో స్పష్టతలేదు. ఒకే టీచర్‌ పని చేస్తున్న చోట విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండగా.. వారు పాఠశాలకురాని రోజు పాఠశాల నిర్వహన
ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉపాధ్యాయులు లేని సమయంలో వారి కొరతను తీర్చే విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేస్తే ఆ సమస్య తీరే అవకాశం ఉంది. అనేకచోట్ల తాగునీటితో పాటు మూత్రశాలలు, మరుగు దొడ్లు, మౌలిక సదుపాయాల విషయం లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక పాఠశాలల్లో పరిమితి కి మించి విద్యార్థుల సంఖ్య పెరగడం సంతోషకరం అని డీఈవో దుర్గాప్రసాద్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కుంటున్నామన్నారు. విద్యావలంటీర్లను రెన్యూవల్‌ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. కానీ, జిల్లాలో ఎక్కడెక్కడ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందో అక్కడ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉపా ధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నాం.
జిల్లాలో ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
2020`21 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 1,156 ప్రభు త్వ పాఠశాలల్లో 95 వేల మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య లక్షా 15వేలకు పెరిగింది. జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. గత విద్యాసంవత్సరం కంటే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురుకులాలు, హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాలు ప్రారంభం కాకపోవడంతో కొంత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, వారం రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో గత విద్యాసంవత్సరం కంటే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 20వేలకు మించే అవకాశం ఉంది. జిల్లాలో అత్యధికంగా నగర శివారులోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో 1,352 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఏ పాఠశాలలో లేనంత మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. చుట్టుపక్కల హాస్టళ్లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో గత సంవత్సరంకంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజుల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని మోపాల్‌ మండలం బాడ్సీ ఉన్నత పాఠశాలలో గత విద్యాసంవత్సరం 122 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 218కి చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ రాంపూర్‌లో గత విద్యాసంవత్సరం 302 మంది విద్యార్థులు ఉండగా.. ఈ సంవత్సరం వారి సంఖ్య 371కి చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ నల్లవెల్లిలో గత సంవత్సరం 211 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 274కు చేరింది. జడ్పీహెచ్‌ఎస్‌ పోతంగల్‌లో గత విద్యాసంవత్సరం 350 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ సంవత్సరం 410కి చేరింది. నిజామాబాద్‌ మండలం జడ్పీహెచ్‌ఎస్‌ సారంగపూర్‌లో గత విద్యాసంవత్సరం 191 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ సంవత్సరం 260కి చేరింది. ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోపాల్‌ మండలం బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం 199 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 322కు చేరింది. నవీపేట మండలం నాళేశ్వర్‌ ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం 140 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 246కు చేరింది. ప్రాథమిక పాఠశాల వేల్పూర్‌లో గత విద్యాసంవత్సరం 102 మంది విద్యార్థులు ఉండగా వారి సంఖ్య ఈ విద్యాసంవత్సరం 239కి చేరింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సిద్దాపూర్‌ పాఠశాలలో గత విద్యాసంవత్సరం 106 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం వారి సంఖ్య 198కి చేరింది. సాటాపూర్‌ తెలుగు విూడియం పాఠశాలలో గత విద్యాసంవత్సరం 163 మంది విద్యార్థులు ఉండగా.. వారి సంఖ్య ఈ సంవత్సరం 250కి పెరిగింది.