సిఎం ప్రచారంపై త్వరలోనే స్పష్టత
ఎన్నికల కోడ్‌తో భారీ ప్రచారాలపై ఆంక్షలు
హుజూరాబాద్,అక్టోబర్2 జనం సాక్షి : హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనే పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌ఎస్ సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు అందజేశారు. మంత్రులు కొప్పు ల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయతో పాటు ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, చల్లా ధర్మారెడ్డి, వి.సతీశ్ కుమార్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డిలు కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు. అయితే సిఎం కెసిఆర్ ఎప్పుడు ఎక్కడ ప్రసంగిస్తారన్నది పార్టీ శ్రేణులు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే దళితబంధు ప్రారంభోత్సవం సదంర్బంగా సిఎం కెసిఆర్ ఓ మారు అక్కడ పర్యటించారు. ఇక ఇప్పుడు అధికారికంగా ఎన్నికల ప్రచారంలో సాగుతారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించిన నాటి నుంచే హుజురాబాద్‌లో ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. గడిచిన మూడు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఇదే కావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ పక్షాన మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రతి ఓటరును రెండు, మూడుసార్లు నేరుగా కలిశారు. వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టి మోకాలుకు శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో దానిని మధ్యలోనే ఉపసంహరించుకున్నారు. ఆయన భార్య ఈటల జమున ఊరూరా పాదయాత్రలతో మహిళా బృందాలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా ప్రచారానికి మునుపటి జోరు లేకుండా కొత్త ఆంక్షలు విధించారు. ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఆంక్షల మధ్య దాదాపుగా పాదయాత్రలు, చిన్నచిన్న వీధి సమావేశాలు, హాలు విూటింగ్‌లకు పరిమితమై ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 8వరకు వారం రోజుల పాటు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 11తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చి అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.