కెసిఆర్ విమర్శల వెనక పరామర్థం ఇదే
హుజూరాబాద్ ఫలితం తరవాత మారనున్న సవిూకరణాలు
హైదరాబాద్,అక్టోబర్9 (జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు రాజకీయాలు చేస్తోంది. మాటకారిగా పేరున్న పిసిసి చీఫ్ రేవంత్ తనదైన శైలిలో తెలంగాణ యాసలో చేస్తున్న విమర్శలు సహజంగానే ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అందుకే సిఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. గత పదేళ్ల క్రితం అధికారంలో ఉండి ఏవిూ చేయలేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా వివిధ కారణాల వల్ల తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇప్పటినుంచే వేడెక్కింది. తెలంగాణపై తన పట్టును నిలుపుకోవాలన్నా, ప్రజల్లో తన పట్ల నెలకొన్న వ్యతిరేకతను పటాపంచలు చేయాలన్నా కేసీఆర్‌కు ఇంకో
ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం పురుడు పోసుకున్నదే అయినప్పటికీ తాను ప్రారంభించిన ’దళితబంధు’ పథకం పైనే కేసీఆర్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు సీఆర్ కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందని ప్రతిపక్షాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టగా, పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ దూసుకెళు తున్నారు. రేవంత్‌రెడ్డి దూకుడు పెరగడం, ఆయన నిర్వహించే సభలకు జనం గణనీయంగా హాజరవు తుండడంతో రేవంత్ లక్ష్యంగా కెటిఆర్ తదితరులు విమర్శలకు దిగుతున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తు అని ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బొడ్లో కత్తిపెట్టుకుని తిరుగుతున్నాడన్న ప్రచారం చేసి విజయం సాధించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు రేవంత్‌ను దెబ్బ కొట్టేందుకు మళ్లీ చంద్రబాబు అస్త్రాన్ని నెత్తికెత్తుకుంది. రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు విచారణ దశలో ఉండడంతో ఆయన ఓటుకు నోటు దొంగ అంటూ ఎదురుదాడి కూడా చేసతున్నారు. రేవంత్ కారణంగా బిజెపి ఎదుగుదల కాస్తా ఆగింది. కాంగ్రెస్ పుంజుకుంటున్నందున ఆందోళనలో బీజేపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టీఆర్‌ఎస్, బీజేపీలకు రేవంత్‌రెడ్డి ఉమ్మడిశత్రువుగా మారాడు. కేసీఆర్ ఢల్లీి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తున్న ప్రతిసారీ రేవంత్ విమర్శలు ఎక్కుపెడుతున్నాడు. ఈ రెండు పార్టీలూ ’ఢల్లీిలో దోస్తీ.. గల్లీలో కుస్తీ’ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ బలపడడాన్ని టిఆర్‌ఎస్ జీర్ణించుకోవడం లేదు. ఇదే సందర్భంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను, హావిూలను ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఎదురుదాడి చేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఐపిఎస్ అధికారి ప్రవీణ్ క ఉమార్ కూడా దళితులను చైతన్యం చేసే ప్రయత్నాల్లో ఊరూవాడా తిరుగుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు దళితుల్లో, ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉంది. ఈ కారణంగా దళితబంధు పథకాన్ని అమలుచేసినా దళితుల ఓట్లు కేసీఆర్‌కు గంపగుత్తగా పడే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుజారాబాద్ ఫలితం తరవాత తెలంగాణ రాజకీయాలు మున్ముందు మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. దళితబంజదు ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి.