` మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్’ సాయం చేయాలి
` ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్’ను వాడుకోవాలి
` రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్’ను వాడుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్’ సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.‘‘బొగ్గు కొరత ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా లోడ్ సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే. ముందు వారు తమ వినియోగదారులకే సేవలందించాలి. 24I7 విద్యుత్ అందించాలి. తమ సొంత వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు’’ అని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.‘‘విద్యుత్ కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద 15శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలను కేటాయించకుండా ఉంచడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అవసరమున్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ‘కేటాయించని విద్యుత్’ను రాష్ట్రాలు ఉపయోగించుకుని తమ ప్రజలకు కరెంట్ సరఫరా చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ మిగులు విద్యుత్‌ను కరెంట్ అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలుంటుంది’’ అని పేర్కొందివినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయకుండా.. కరెంట్‌ను అధిక ధరకు విక్రయించే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు ‘కేటాయించని విద్యుత్’ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి.. దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది.
విద్యుత్ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన