_చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా**
కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్**
కరీంనగర్: సంక్షేమ పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్న.. కేంద్ర బడ్జెట్ పుస్తకాలు తీసుకుని వస్తా. కేంద్రమంత్రిగా మీరు రండి. రాష్ట్ర ఆర్థికమంత్రిగా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా’అని అన్నారు. హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చగా, కేంద్రంలోని బీజేపీ మాత్రం తన వాగ్దానాలను విస్మరించిందని అన్నారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నల్లధనం వెలికి తీస్తామని, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పినవి ఏవీ చేయని పార్టీ బీజేపీ అని.. అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ మీద 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.99,068 ఆదాయం రాగా గత సంవత్సరం 2020–21లో పెంచిన పన్నుల వల్ల రూ.3,72,970 కోట్లు రాబటి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రం వాటా ఉందనడం హాస్యాస్పదమన్నారు. దళితబంధును తాను ఆపలేదని రాజేందర్ అంటున్నారు కానీ, దీనిపై ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి రాసిన లేఖ సంగతేంటని ప్రశ్నించారు. అబద్ధాల్లో బీజేపీకి ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టా లని చూస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.