` చట్టం ముందు అందరూ సమానులే
` కానిస్టేబుల్‌కు సన్మానం
హైదరాబాద్,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకొని మరీ అభినందించారు. సామాన్య ప్రజలు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని.. చలాన్ విధించిన రోజు తాను వాహనంలో లేనని కేటీఆర్ స్పష్టం చేశారు. లంగర్‌హౌజ్ సంగం సవిూపంలో బాపూఘాట్‌లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు శాలువా కప్పి అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ సైతం చెల్లించారు. ఈ విషయంలో తెరాస కార్యకర్తలు, నాయకులకు కూడా సరైన సందేశం అందేందుకే ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.