రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌


` బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిలన్‌ల కృషికి ఫలితం
స్టాక్‌హోం,అక్టోబరు 6(జనంసాక్షి):రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌, అమెరికాకు చెందిన డేవిడ్‌ మెక్‌మిలన్‌లకు 2021వ సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. అణు నిర్మాణం కోసం నూతన, సృజనాత్మక సాధనం అసిమెట్రిక్‌ ఆర్గనోకెటలిసిస్‌ను అభివృద్ధిపరచినందుకు వీరిని ఈ బహుమతికి రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ ఎంపిక చేసింది. రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటిస్తూ, అనేక కెమికల్‌ రియాక్షన్స్‌ కోసం ఆర్గానిక్‌ కేటలిస్ట్స్‌ను ఉపయోగించవచ్చునని రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. సోలార్‌ సెల్స్‌లోని కాంతిని క్యాప్చర్‌ చేయగలిగే అణువులు, కొత్త ఫార్మాస్యూటికల్స్‌ వంటివాటిని పరిశోధకులు సమర్థవంతంగా అభివృద్ధిపరచడానికి ఈ రియాక్షన్స్‌ ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ కేటలిస్టులు పర్యావరణ హితకరమైనవని, అదేవిధంగా వీటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ అని తెలిపింది. దాదాపు ఓ శతాబ్దం నుంచి నోబెల్‌ బహుమతులను రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ అందజేస్తోంది. సైన్స్‌, సాహిత్యం, శాంతి కోసం విశేషంగా కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తుంది. నోబెల్‌ పురస్కారం క్రింద 1.14 మిలియన్‌ డాలర్లు అందజేస్తుంది.