జర్నలిస్టులను విస్మరిస్తే పతనం తప్పదు  -టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ


చరిత్రలో జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించలేదని, జర్నలిస్టుల కన్నీళ్లతో పతనమై పోయాయని తెలంగాణ  రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. 

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి రోజైన ఇవ్వాళ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఎంజి రోడ్డున గల గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెప్పారు. స్వాతంత్ర్యానంతరం  వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ఉద్యమ ఫలితంగా సాధించుకున్న గొప్ప చట్టాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సహించారనిదన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తమ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందని కలలు గన్న జర్నలిస్టులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం అమలుకు ఆమడదూరంలో ఉండి పోయిందన్నారు. హెల్త్ కార్డులను ఆసుపత్రుల నిర్వాహకులు తిరస్కరిస్తుండడంతో ఉన్న ఆస్తులను అమ్ముకొని, అప్పులు చేసి జర్నలిస్టులు చికిత్స పొందుతున్నారని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనతో రాష్ట్రంలో 150 మంది జర్నలిస్టులు మృతి చెందారని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు ఆయన ఆరోపించారు. ఏండ్ల తరబడి గూడు కోసం నిరీక్షిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలక్ష్యాన్ని విడనాడి జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎం.ఏ.మజీద్,  ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హాబీబ్ జీలని, అజిత, మల్లయ్య, హెచ్.యు.జె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగా శంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోతె వెంకట్ రెడ్డి, జి.బలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వినతి పత్రాన్ని అందించారు. 


120 కేంద్రాల్లో ఆందోళన 

ఆందోళన విజయవంతం..

జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన విజయవంతంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల్లోని 120 కేంద్రాల్లో దాదాపు 3000 మంది జర్నలిస్టులు గాంధీ విగ్రహాల ముందు నిరసన చేపట్టి మహాత్ముడికి వినతి పత్రాలను అందించారు.