లఖింపూర్ ఖేరి ఘటనతో విపక్షాల్లో ఉత్సాహం
ముంచుకొస్తున్న విద్యుత సమస్యపై పోరాటానికి సిద్దంలక్నో,అక్టోబర్11 ( జనం సాక్షి ), : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగనున్న నేపత్యంలో యోగి సర్కార్‌కు సమస్యలు గుదిబండగా మారుతున్నాయి. ఓ వైపు రైతుల సమస్యలు, మరోవైపు విద్యుత్ సంక్షోభం ఇప్పుడు దూసుకుని వస్తున్నాయి. యోగి సర్కార్‌కు ఇలా పలు సమస్యలు గుదిబండగా మారుతున్నాయి. ఇటీవల ప్రధాని యూపి పర్యటలనో ఏ సమస్యా ప్రస్తావించ కుండా పోవడం గమనార్హం. దీనికితోడు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు నూరుతున్నాయి. అన్ని పార్టీలు కదనరంగంలో దూకి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. అధికార బీజేపీకి ఎన్నో ప్రతికూలతలు ఉన్నా తమ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశాలు లేవని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ఓడిరచగల స్థాయికి ప్రతిపక్షాలు ఇంకా పుంజుకోలేదని భావిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, ప్రధాని నరేంద్రమోదీ ప్రభ తగ్గినా, సాగు చట్టాలపై నిరసనలు తెలుపుతున్న రైతుల్లో లఖీంపూర్ ఖీరీ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చినా.. వాటిని అధిగమించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లఖీంపూర్ ఖీరీ ఘటన తర్వాత యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంకగాంధీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఉధృత కార్యాచరణకు పూనుకున్నారు. వారాణసీలో భారీ ర్యాలీ నిర్వహించడం, ప్రతిజ్ఞా యాత్ర పేరిట 12 వేల కిలోవిూటర్లు యాత్ర నిర్వహిస్తానని ప్రకటించడంతో యూపీలో కాంగ్రెస్ ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ పుంజుకున్నా.. అది బీజేపీ వ్యతిరేక ఓట్లను మాత్రమే చీలుస్తుందని, చివరకు కమలనాథులకే లాభమని బిజెపివర్గాలు పేర్కొంటున్నాయి. లఖీంపూర్ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీ దాదాపు 40శాతం ఓట్లు సాధించింది. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాభవం మరింత పెరిగి 50శాతం దాకా ఓట్లు సాధించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ ప్రధాని మోదీకితోడు సీఎం యోగి ప్రభావం కూడా పనిచేసింది. అయితే యూపీలో బీజేపీకి కనీసం 18`20 శాతం వరకు మూల ఓటర్లు ఉన్నారని, ఎటువంటి పరిణామాల్లోనైనా ఇది తగ్గే అవకాశాల్లేవని రాజకీయ విశ్లేషకుల అంచనా. పైగా సీఎం యోగి వ్యక్తిగత పలుకుబడి కారణంగా ఈ ఓట్లు మరో 5`7శాతం పెరిగాయని, దీంతో బీజేపీకి కనీసం 25శాతం ఓట్లు స్థిరంగా ఉంటాయన్నది వారి
అభిప్రాయం. రైతుఉద్యమాలు, మోదీ ప్రభావం తగ్గడం, యోగి సర్కార్ పట్ల వ్యతిరేకతతో 10`15శాతం ఓట్లు తగ్గినా బీజేపీ గెలుపునకు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. యూపీలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) ఓట్ల శాతం 18 నుంచి 25 శాతానికి పెరుగుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రాష్టీయ్ర లోక్‌దళ్‌తో పొత్తుతో ఆ పార్టీకి ఓటు శాతం మరో 5 పెరిగినా ఆశ్చర్య పడనక్కర్లేదని అంటున్నాయి. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమైనా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ పార్టీ సైంధవ పాత్ర పోషించే అవకాశాలపై యూపీలో చర్చ జరుగుతోంది. బీఎస్పీ ఎంత బలహీనపడ్డా యూపీ రాజకీయాల్లో మా యావతి కనీసం 15 శాతంఓట్లు సాధించగలిగే పరిస్థితిలో ఉన్నారు. నిజానికి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మాయావతి, అఖిలేశ్‌యాదవ్ కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించగలిగారు. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసికట్టుగా పోటీ చేసినా.. బీజేపీని ఓడిరచలేకపోయాయి. ఈసారి ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించినందున మాయావతి బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా అఖిలేవ్‌కు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. మరోవైపు ఎంఐఎం నేత ఒవైసీ ఇప్పటికే యూపీలో వందకుపైగా స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది ఎస్పీకి నష్టం కలిగించవచ్చని, 20 నుంచి 25 స్థానాల్లో దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.