ఇసి ఉత్తర్వులను రద్దు చేయాలన్న పిటిషన్ల కొట్టివేత
ఇసి నిర్ణయాన్ని ప్రశ్నించలేమన్న హైకోర్టు ధర్మాసనంహైదరాబాద్,అక్టోబర్28జనం సాక్షి : దళిత బంధుపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు ప్రకటించిన తరవాత ఈసి తీసుకునే నిర్ణయాలను నిలువరించలేమన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధు ను ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. గురువారం నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.