బస్సులో ప్రయాణఙకులతో సమస్యలపై ముచ్చట
చెన్నై,అక్టోబర్23 జనంసాక్షి : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చైన్నైలోని టీ నగర్ నుంచి కన్నగినగర్ వైపు వెళ్తున్న ఓ సిటీ బస్సులో ప్రయాణించారు. ఉదయం తన కాన్వాయ్‌లో వస్తున్న సీఎం స్టాలిన్ టీ నగర్ బస్టాఫ్ వద్దకు రాగానే ఉన్నట్టుండి కాన్వాయ్ అపేశారు. అంతలోని కారు దిగి సరాసరి టీ నగర్ బస్టాండ్‌లోకి వెళ్లి అక్కడి నుంచి కన్నగినగర్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సులో ఎక్కారు.ఆయన రావడాన్ని గమనించిన ఆ బస్సులోని ప్రయాణికులు కేరింతలు వేస్తూ ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. అంతేకాకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా..? బస్సులు సమయానికి వస్తున్నాయా..? అంటూ ప్రయాణికులతో స్టాలిన్ ముచ్చటించారు. కన్నగినగర్ బస్టాండ్ వరకు ప్రయాణించి ఆయన దిగిపోయారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా నాటి నుంచి ఈ విధంగా సీఎం స్టాలిన్ అందరినీ అశ్చర్యపరుస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ తనదైన ముద్రను వేస్తున్నారు.