రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై
అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్హైదరాబాద్,అక్టోబర్11 (జనంసాక్షి) : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 1961 నవంబర్ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరొందిన ఆయన తండ్రి బీఎన్ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జబల్‌పూర్‌లో ఇంటర్, సాగర్‌లోని హరిసింగ్‌గౌర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు స్జబెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి, నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించడం విశేషం. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానల్ కౌన్సిల్‌గా నియమితు లయ్యారు. 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ 4వ వారు. తొలి సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, అనంతరం జస్టిస్ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే హిమాకోహ్లీ సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లారు.