` ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర సమాయాత్తం
ముంబయి,డిసెంబరు 11(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 32కు చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఏడు కేసులు ఒక్క శుక్రవారమే బయటపడ్డాయి. ఇందులో ముంబయి నుంచి మూడు, పింప్రీ`చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఒమిక్రాన్ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేనివారిని కూడా స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడిరచారు. డిసెంబరు 1 నుంచి ముంబయి, పుణె, నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టుల ద్వారా 61వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 10వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే అని చెప్పారు. వారందరినీ ట్రేస్ చేసే పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ముంబైలో 144 సెక్షన్