అధికారులు వెళ్లినా కానరాని ఆసక్తిఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌పై దృష్టి
నిజామాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఇంటింటికి వెళ్లి, ఫోన్‌ల ద్వారా సూచిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవడం లేదు. తాజాగా ఇతర దేశాల్లో ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజలు ఇంకా జంకుతున్నారు. కరోనా కాటుకు జిల్లాలో వందల మంది మృతి చెందినా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. ప్రభుత్వం కొవిషీల్డ్, కొవాగ్జీన్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టీకా ద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ కొవిడ్ టీకా తీసుకునే విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చని వైద్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నా ఆసక్తి చూప డం లేదు. మొదటి డోసు వేయించుకుని రెండో డోసుకు అర్హత సాధించిన వారి పూర్తి వివరాలు వైద్య శాఖ అధికారుల వద్ద ఉన్నాయి. వీరి సెల్ నెంబర్‌లకు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఫోన్‌లు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పక్రియ ప్రారంభించాక జిల్లాలో గతంతో పోల్చితే కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇతర దేశాల్లో కొత్త రకాల వేరియంట్లు ఒమైక్రాన్ వంటి వైరస్‌ల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తమై వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇక నుంచి సినిమాహాళ్లు, పబ్‌లు, పార్కులు, షాపింగ్ మాల్స్‌లోకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో రూ. వెయ్యి జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఇతర రాష్టాల్రు దేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే.