విచారణకు వెళ్లివచ్చిన విద్యార్థి హఠాన్మరణం

పోలీస్‌ స్టేషన్‌ ముందు తల్లిదండ్రుల ఆందోళన

చెన్నై,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): రామనాథపురం జిల్లాలో విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో ఆ మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లాలోని ముదుకుళత్తూరు సవిూపంలోని నీర్‌కోళియేందల్‌ అనే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (21) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. అయితే, పరమకుడి ` కీథత్తూరువల్‌ రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వచ్చిన మణికంఠన్‌... వాహనాన్ని ఆపకుండా అతివేగంతో దూసుకుని వెళ్ళాడు. దీంతో పోలీసులు ఛేజ్‌ చేసి ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న మణికంఠన్‌ తల్లిదండ్రులు స్టేషన్‌కు వచ్చి తమ బిడ్డను విడిపించుకుని ఇంటికి తీసుకెళ్ళారు. అయితే, ఇంటికి వెళ్ళి కొద్దిసేపటికే మణికంఠన్‌ చనిపోయాడు. దీంతో మృతుని తల్లిదండ్రులు, బంధువులు పోలీసులు తీవ్రగా కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.