కాశ్మీర్‌ను జైలుగా మార్చారు


`మెహబూబాముఫ్తీ
` జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా
దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌ సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఇక్కడి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. కశ్మీర్‌లో తనకు నిరసన తెలపడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘‘కశ్మీర్‌ మొత్తం జైలులా మారింది. అభిప్రాయాలు వెల్లడిరచడానికి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. అణచివేత విధానాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం అంతా బాగుందంటూ ప్రచారం చేస్తోంది’’ అని విమర్శించారు. జమ్మూ`కశ్మీర్‌లో అవినీతి పెరిగిందని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. నాగాలాండ్‌లో సైన్యం అమాయకులను కాల్చి చంపితే బాధ్యులపై కేసులు పెట్టారని, కశ్మీర్‌లోనూ అలాంటివి చోటు చేసుకుంటున్నా పట్టించుకునేవారే లేరని అన్నారు. ‘‘దేశ ప్రజలంతా ఇప్పటికైనా మేల్కోకపోతే గాంధీ, అంబేడ్కర్‌ల భారత దేశం గాడ్సే దేశంగా మారిపోతుంది. అప్పుడు అందరం నిస్సహాయులుగా మిగిలిపోతాం’’ అని అన్నారు. మంచి ఫొటో కోసం మాస్కు తీసేయాలని ఫొటోగ్రాఫర్లు ఆమెను కోరగా ‘‘మాస్కు తీశానంటే వెంటనే నన్ను ‘ఉపా’ కింద అరెస్టు చేస్తారు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.