పంటల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి
విరివిగా రుణాలు ఇచ్చేలా బ్యాంకులను సన్నద్దం చేయాలి
హైదరాబాద్,డిసెంబర్15 (జనంసాక్షి):- తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేండ్లలో రాష్ట్రంలో 7,409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ కైమ్ర్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లెక్కల ప్రకారం ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాల అంచనా వేస్తున్నాయి. . ఇక రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలోపు ఉన్న రైతులకు బీమా అమలు చేస్తున్నది. ఈ లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 7,358 మంది రైతులు చనిపోయారు. ఇందులో సాధారణ మరణాలు, యాక్సిడెంట్లు, పాము కాటు వంటివి తీసేస్తే ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 10 నుంచి 15 శాతం వరకు ఉంటుందని కూడా అధికారులే
చెప్తున్నారు. గడిచిన మూడేండ్లలో వివిధ కారణాలతో 74 వేల మంది రైతులు ప్రాణాలొదిలినట్లు రైతుబీమా లెక్కలే చెప్తున్నాయి. ఇందులో పదోవంతుకుపైగా ఆత్మహత్యలే ఉంటున్నాయని, రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమని రైతు సంఘాల నాయకులు, వ్యవసాయాధికారులు అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ కింద నష్ట పరిహారం అందజేయాలి. అప్పుల బాధలకు తోడు సెంటర్లలో వడ్లు పోసి వారాలు గడుస్తున్నా సర్కారు కొనకపోవడం, యాసంగిలో వరి సాగు వద్దనడం, ప్రత్యామ్నా యంగా ఏ పంటలు వేయాలో తెలియకపోవడం వంటి కారణాలు కూడా రైతులను కుంగదీస్తున్నాయి. ఇంకా పలురకాల కారణాలతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వానాకాలంలో ప్రభుత్వం చెప్పినట్లు సన్నవడ్లు సాగు చేసినా దిగుబడి రాక, గిట్టుబాటు కాక ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. వానాకాలంలో సుమారు 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 6,821 కొనుగోలు సెంటర్ల ద్వారా కోటి 3 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో కేంద్రం ప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సెప్టెంబర్‌లోనే అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం 43 లక్షల పైచిలుకు టన్నులు ధృాన్యం మాత్రమే సేకరించింది. గతంలో లాగా పూర్తి స్థాయిలో సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో కొనుగోళ్లను పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. రుణమాఫీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దీంతో అప్పు మాఫీకాక, బ్యాంకుల్లో కొత్త అప్పు పుట్టుక, మిత్తిలకు తెచ్చిన రుణాలను తీర్చే వెసులబాటు లేక మనస్తాపంతో రైతులు ప్రాణాలు వదులుతున్నారు. తమ పొలంలో వరి తప్ప వేరే పంట పండదని, ఇప్పుడు వరి సాగు చేయొద్దంటే ఎట్లా బతికేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు 40 లక్షల టన్నులకు గోదాముల సామర్థ్యం పెంచుకున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు గోదాముల సామర్థ్యం లేదని అంటోంది. రైతుల మరణాలు, ఆత్మహత్యలకు ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలి. గిట్టుబాటు ధరలను కల్పించి, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇయ్యాలి. ఫసల్ బీమా కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇంకో బీమా తీసుకురావాలి. గిట్టుబాటు ధరకు పంట అమ్ముకునే సౌకర్యం రైతులకు కల్పించాలి. లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. ప్రైవేటుల వడ్డీ భారం పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున బ్యాంకులు ఉదారంగా రుణృాలు ఇచ్చేలా చూడాలి.