లోకేశ్‌ను తల్లిగా తాను అలాగే పెంచాను
చంద్రబాబు కన్నీటి వెనక నాపై ప్రేమ ఉంది
అసెంబ్లీలో ఏం మట్లాడాలో తెలుసుకుంటే మంచిది
ఎన్టీఆర్ ట్రస్ట్ పక్షాన వరదబాధితులకు సాయం అందించిన భువనేశ్వరి
తిరుపతి,డిసెంబర్20 (జనం సాక్షి ): మహిళలను గౌరవించే సంస్కృతి ఉండేలా ఓ తల్లిగా లోకేష్‌ను పెంచానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం భువనేశ్వరి తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వరదబాధఙతులకు సాయం అందించారు.
మా కంపెనీ బోర్డ్ విూటింగ్‌లో మగాళ్ల గురించి, మహిళల గురించి మాట్లాడడం, కంపెనీ గురించి, సీఎస్‌ఆర్ ద్వారా చేయాల్సిన సేవల గురించి మాట్లాడుతాం. ఆలయం లాంటి అసెంబ్లీలో ఏమి చర్చించాలో అదే చర్చించాలి. అక్కడ ఎవరూ ఏమి మాట్లాడారో నాకు అనవసరం. నాకు నా భర్త సపోర్ట్ ఉంది. ఆయన కన్నీరు వెనుక నా పట్ల ప్రేమను చూశా. ఎవరి క్షమాపణ నాకు అనవసరం, నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు వారం, పది రోజులు తట్టుకోలేకపోయా. లోకేష్ రాజకీయాల్లో మహిళలకు గౌరవం పెరిగేలా పనిచేస్తాడు. మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదు. నాపైన జరిగిన దాడికంటే, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు దారుణంగా ఉన్నాయి. నాపై జరిగిన దాడి తర్వాత నాలాగే దాడికి గురవుతున్న మహిళల వ్యథ మరింతగా అర్థమైంది. మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు బాధాకరం. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని తల్లి, చెల్లిని ఎలా చూస్తారో సమాజంలోని మహిళలను అలాగే చూడాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సేవలను విస్తరిస్తాం. ఎక్కడ ఎలాంటి ఆపద, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ట్రస్ట్ సేవలు అందిస్తుంది. ట్రస్ట్ వలంటీర్లు కూడా దేశవ్యాప్తంగా మాతో కలసి పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.
అసెంబ్లీలో ఇటీవలి పరిణామాలపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తనను అమానించిన వాళ్లు? వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యానించారు. వాళ్లు వచ్చి సారీ చెబుతారని తానేవిూ ఎదురు చూడటం లేదన్నారు భువనేశ్వరి. ఆ విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అన్నీ పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ తనకు మద్దతుగా నిలడ్డారని చెప్పారు. హెరిటేజ్‌ను కూలగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారని.. సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయని.. ఎవరూ టచ్ చేయలేరని స్పష్టం చేశారు. తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి.. వరద ప్రమాద మృతులకు ట్రస్ట్ తరఫున ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. దేశంలో ఏ ఆపద వచ్చినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పారు.