బ్రిటన్ నుంచి మహిళకు నెగిటివ్ నిర్ధారణ
ఊపిరి పీల్చుకున్న అధికారులు
హైదరాబాద్,డిసెంబర్6 (జనం సాక్షి); తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది నిర్దారించేందుకు జీనోమ్ స్వీకెన్సీంగ్ ల్యాబ్‌కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు.ఇదిలావుంటే డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీనోమ్ సీక్వెన్స్‌కు నమూనాలు పంపించిన సంగతి తెలిసిందే. అయితే జీనోమ్ నివేదికలో ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం వెల్లడిరచారు. యూకే నుంచి వచ్చిన మహిళ(35) స్వస్థలం రంగారెడ్డి జిల్లాగా గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. మాస్కు ధరించని యెడల రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే కరోనా మన దరి చేరదు అని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్ డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న విషయంలో వాస్తవం లేదన్నారు. కాగా ఇప్పుడిప్పుడే ఎలాంటి ఆంక్షలను విధించబోమని ఆయన వెల్లడిరచారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నా మరణాలు మాత్రం సంభవించడం లేదని పేర్కొన్నారు. వైరస్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కోరింది. ప్రజలు భయాపడాల్సిన అవసరంలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణలో శనివారం ఒక్కరోజే 3 లక్షల 70 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాలకు లోనుకాకుండా కరోనా జాగ్రత్తలను పాటించాలని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ ఒమిక్రాన్ వ్యాప్తి చెందిన పూర్తిగా ఎదుర్కొవడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది.