తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం


శుభవార్త ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో, జోనల్‌ పోస్టులకు, మల్టీ జోనల్‌ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో తక్షణమే పక్రియ మొదలుకానుంది. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అనంతరం చేపట్టనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోనుంది. సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుంది. 70 శాతానికి పైగా సమస్యలు ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పిల్లల్లో మానసిక దివ్యాంగులుంటే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.