తెలంగాణలో మరోమారు కరోనా కలకలం

  

పలుచోట్ల కరోనా కేసులతో ఆందోళనతాజాగా 189 పాజిటివ్‌ కేసులు నమోదు

హైదరాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పుడామె టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అది ఏ వేరియంట్‌ అనేది ఇంకా స్పష్టత రావాలి. ప్రస్తుతానికి ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి.. అధికారులు కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మాస్క్‌ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్‌ వేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇకపోతే సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలం కుటుంబం మొత్తం కరోనా బారిన పడిరది. డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. జర్మనీ నుంచి ఆయన కుమారుడు వచ్చారు. 2 రోజుల క్రితం వారికుటుంబం అంతా తిరుపతికి వెళ్లొచ్చారు. ఎయిడ్స్‌ డే సందర్భంగా.. కోటాచలం వైద్యసిబ్బందికి బహుమతులు కూడా ఇచ్చారు. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో కరోనా కలకలం రేపుతోంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు, స్కూల్‌ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సరూర్‌నగర్‌లోని పననియా మెడికల్‌ కాలేజీలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ తేలింది. మొత్తం క్లాస్‌లో 90 మంది విద్యార్థులు ఉండడంతో .. వారందరిలోనూ టెన్షన్‌ నెలకుంది. జగిత్యాల జిల్లాలోనూ కరోనా భయపెడుతోంది. పట్టణంలోని కృష్ణా నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్ధికి కరోనా సోకింది. దీంతో ఆ క్లాస్‌ రూమ్‌ మూసివేసి.. మిగిలిన తరగతులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాలో మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలోనూ తొమ్మిది మంది విద్యార్ధులకు కరోనా సోకింది. రాష్ట్రంలో గురువారం 36,883 కరోనా టెస్టులు చేయగా, 189 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు ప్రాణాలు విడువగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు.