అమరావతి ఉద్యమం అప్రతిహతంగా సాగుతోంది. ఈ ఉద్యమం చూసి కూడా సిఎం జగన్ స్పందించక పోగా.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జనగ్‌కు ఎందు కనో రైతుల యాత్రతో కొంత కంపరం పుట్టుకొచ్చిందని అర్థం అవుతోంది. అదే సమయంలో రైతుల ఉద్యమంతో లోలోన భయం కనిపిస్తోంది.. అందుకే వారిని తిన్నగా తమపని తాము చేసుకునేలా కనిపిం చడం లేదు. వారికి ఆంక్షలు విధించడం ద్వారా తన నిరంకుశ విధానాలు అమలుచేస్తున్నారు. అదేదో తెలుగుదేశం కార్యక్రమంగా చూస్తూ ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జగన్, అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ అసలు రాజధాని లేకుండాచేసిన ఘనతను చాటాడు. అభివృద్ధిపై ఆశతో, భవిత బంగారం అవుతుందన్న నమ్మకం తో భూములిచ్చిన రైతుల ఆశయాలను తుంగలో తొక్కారు. ఉద్యమించిన రైతులపై లాఠీలతో విరుచుకు పడ్డారు. పచ్చని అమరావతిని ఎడారి చేశారు. న్యాయస్థానం ముందు కడుపు చించుకున్న జనం, ఏడు కొండల స్వామికి నివేదించుకోవడానికి బయలుదేరారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగు తున్న యాత్రను పోలీసులు తిన్నగా సాగనీయడం లేదు. అమరావతి ఏకైకరాజధాని కావాలని అంటూ 37వ రోజున చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టారు. కానీ వారు తిరుమల శ్రీవారినిదర్శించుకోకూడదని, తిరుపతిలో సభ పెట్టకూడదంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. ఢల్లీిలో రైతుల ఉద్యమానికి కేంద్రం దిగివచ్చి ఏకంగా మూడు సాగుచట్టాలను రద్దు చేసింది. ప్రధాని మోడీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పారు. ఢల్లీి ఉద్యమాన్ని చూసైనా ఆయన తన గతిని మార్చుకోవడం లేదు. కనీసం విశాఖనయినా రాజధానిగా ప్రకటించినా బాగుండేది. యువకుడుగా ఉన్న ఓ వ్యక్తి ముఖ్యమంత్రి సిఎం అయితే పాలన పరుగులు పెట్టాలి.కానీ ఇంత దరిద్రంగా.. తండ్రిని కూడా తిట్టుకునేలా...చేయడం దారుణం కాక మరోటి కాదు.అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రకు స్వాగతం పలికేందుకు, మద్దతు ప్రకటించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సామాన్య జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వీరితో పాటు ప్రజాసంఘాల తరపున కూడా పలువురు యాత్రకు మద్దతు ప్రకటించి బృందంతో పాటు కలసి నడిచారు. మహాపాదయాత్ర జాతరను తలపిస్తోంది. ప్రతి గ్రామంలో డప్పులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలతో, బాణాసంచా పేలుళ్ళ నడుమ జనం స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర బృందంపైనా, శ్రీవారి రథంపైనా పూలవర్షం కురిపించారు. ప్రత్యేకించి మహిళలు సాంప్రదాయానుసారం పళ్ళేల్లో పూలు, పండ్లు, పసుపు కుంకుమలతో వచ్చి శ్రీవారి రధానికి పూజలు చేశారు. హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. కొన్ని చోట్ల శ్రీవారి రధానికి ముందు బిందెలతో నీళ్ళుతెచ్చి రోడ్డంతా శుభ్రం చేసి స్వాగతం పలికారు. దేవుడి రధంతో పాటు పాదయాత్ర బృందంపై కూడా పూలు చల్లుతూ వారిలో ధైర్యంనింపుతున్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీవారి రథానికి మహిళలు సారథులుగా వ్యవహరించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వారికి ఎక్కడిక్కడ భోజనాలు అందిస్తున్నారు. విరాళాలు అందచేస్తున్నారు. ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని కావడానికి సహకరించండి..అంటూ అభ్యర్థిస్తూ సాగుతున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. మా మద్దతు విూకు ఎప్పుడూ ఉంటుందని ఎక్కడిక్కడ స్థానికులు మద్దతు ఇస్తున్నారు. రాజధాని రైతులకు సంఫీుభావం తెలపడానికి ప్రజలు ఇళ్లు వదలి వీధుల్లోకి వస్తున్నారు. మంగళహారతులు పట్టి, పూలవర్షం కురిపిస్తున్నారు.
బాణసంచాలు, బ్యాండు మేళాలు, డప్పులు, వివిధ కళారూపాల విన్యాసాలతో పాదయాత్ర అట్టహాసంగా సాగుతోంది. అడుగడుగునా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు సంఫీుభావం తెలపడంతో పాటు ఉద్యమానికి విరాళాలు ప్రకటించారు. ఢల్లీి ఉద్యమ నాయకులు రాకేష్ టికాయత్ మేనళ్లులు అమరావతి రైతుల పాదయాత్రలో కలిసి సంఫీుభావం ప్రకటించారు. రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని ఇప్పుడు ఇలా అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. సుస్థిర రాజధాని లేకుంటే రాష్ట్ర ప్రగతి ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. అన్ని రాష్ట్రల రైతు సంఘాల మద్దతుతో పోరాడుతామన్నారు. పాదయాత్రకు లభించిన ప్రజాదరణ తమలో ఉత్సహాన్ని, ధైర్యాన్ని నింపిందని అమరావతి జేఏసీ నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నమ్మి అమరావతి కోసం 29 గ్రామాల ప్రజలు ఎంత భూమిని ఇచ్చారో మనం అర్థంచేసుకోవాలి. ఆంధ్రులు ఆరంభశూరులు అంటారు. కానీ ఇప్పుడు ఆరంభం కూడా కనిపించడం లేదు. మొన్న అమరావతికి, నిన్న పోలవరానికి పట్టిన గతి తెలిసి కూడా ప్రజల్లో కనీసం చైతన్యం లేకపోవడాన్ని గమనించిన కేంద్రపెద్దలు ఎలాంటి చర్యకు ముందుకు రావడంలేదు. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తే, ఇప్పుడు వారిని ఎగతాళి చేస్తున్నారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల ప్రజల సమస్యగానే చూస్తున్నారు. రాజధాని ఉన్నా లేకపోయినా పట్టడం లేదు. అదేమంటే.. ఆ సామాజిక వర్గానికి మాత్రమే రాజధాని వల్ల ఉపయోగం, మాకేం వస్తుందని వైసిపి నేతలు పెదవి విరుస్తున్నారు. దీంతో అమరావతి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటం పొరుగు గ్రామాల ప్రజలను కూడా కదిలించలేకపోతోంది. అమరావతి లేదా? పోతే పోనీ.. అక్కడి రైతులేగా నాశనం అయ్యేది అన్నట్టుగా ఇతర ప్రాంతాల ప్రజలు ఉదాసీనంగా ఉంటున్నారు. కార్యనిర్వాహక రాజధాని పేరిట విశాఖ పట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తలపోశారు. కార్యనిర్వాహక రాజధాని వస్తే తాము బాగుపడిపోతామని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు. మొత్తంగా రెండున్నరేళ్లు దాటిన తరవాత ఇప్పుడు ఎపి రాజధాని ఏదంటే తెల్ల మొహం వేయాల్సిన పరిస్థితిని జగన్ కల్పించారు. రైతుల ఉద్యమం ఫలితం ఎలా ఉంటుందన్నది ఎన్నికల్లో మాత్రమే తేలగలదు.