దేశం కోసం కొడుకు ప్రాణాలర్పించాడు


కన్నీరుమున్నీరయిన సాయితేజ తండ్రి

చిత్తూరు,డిసెంబర్‌10 జనంసాక్షి: దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్‌ అన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం దక్కలేదని ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని చెప్పారు. సాయితేజ మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయామని అన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ తన కుమారుడు ఆర్మీలో చేరి ఉన్నత స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని.. ఇలాంటి సమయంలో సాయితేజ ప్రమాదంలో మరణించడం చాలా బాధగా ఉందన్నారు. తన రెండో కొడుకు హిమాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిన్ననే ఇంటికి వచ్చాడని తెలిపారు. తన ఇద్దరు కుమారులు రెండు కళ్లుగా భావించానని, ఒక కన్ను పోయింద న్నారు. సాయితేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, అతని భార్య చదువుకుందని, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం నిలబడుతుందని మోహన్‌ అన్నారు. కాగా సాయితేజ కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీలకు అతీతంగా అన్నీ పార్టీల నేతలు తరలి వస్తున్నారు. టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు మోహన్‌ కుటుంబాన్ని పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పారు.