నిర్మాణ పనుల్లో అలసత్వానికి ఎవరు బాధ్యలు
మేఘా కంపెనీకి అప్పగించినా ఎందుకీ జాప్యం?
కేంద్రమంత్రి ప్రకటనపై ప్రభుత్వం సమాధానమిస్తుందా
అమరావతి,డిసెంబర్7 ( జనం సాక్షి ) : పోలవరం 2022 ఏప్రిల్ నాటికి పూర్తి కావడం కష్టమేనని.. ఎన్నో కారణాల వల్ల పనుల్లో ఆలస్యమవుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా పనుల పురోగతిపై రాష్ట్రప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. గడువులోగా పూర్తిచేస్తామని సిఎం జగన్ ప్రకటించినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులను మేఘాకు అప్పగించినా పనుల్లో పురోగతి కానరావడం లేదు. పోలవరంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు మాత్రమే ప్రభుత్వం శ్రద్ద పెట్టింది. ఇప్పటికీ నిర్వాసితులకు పూర్తిస్తాయిలో రక్షణకల్పించలేదు. వారికి ఇస్తామన్న ప్యాకేజీలు, ఇళ్ళు రాలేదు. మరోవైపు ప్రాజెక్ట్‌లో నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2022 నాటికి పోలవరం పూర్తి కావడం కష్టమేనంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతినెలా పనులను రివ్యూ చేస్తున్నా కరోనా వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని కేంద్రం పేర్కొంది. సహాయ, పునరావాస కార్యకలాపాల్లో ఆలస్యం కూడా కారణమని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ ఇచ్చిన సమాధానం ప్రకారం పోలవరంలో ఎక్కడవేసి గొంగళి అక్కడే అన్నచందంగా కనిపిస్తోంది. పోలవరంలో స్పిల్‌వే, అప్స్టీమ్ర్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ `గ్యాప్ 3, డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ వంటి కీలక భాగాల నిర్మాణం ఇప్పటికే పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. స్పిల్‌వే రేడియల్ గేట్లు 88శాతం, స్పిల్ ఛానెల్ 88శాతం, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ 73శాతం, పైలట్ ఛానెల్ పని 34శాతం, పవర్ హౌస్ పునాది తవ్వకం 97శాతం పూర్తయినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనుల ప్రస్తుత స్థితి షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్నట్లు కనిపించట్లేదని స్పష్టం చేశారు. కరోనా, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ గ్యాప్1, గ్యాప్`2 పనులు, పునరావాస కార్యకలాపాలు పూర్తి చేయడంలో ఆలస్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు ప్రాజెక్ట్‌లో నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రాజెక్ట్ రెండవసారి సవరించిన అంచనా వ్యయం 55,548 కోట్లని, 2019 ఫిబ్రవరిలో సలహా సంఘం సమావే శంలో దీన్ని ఆమోదించినట్లు పేర్కొన్నారు. అయితే సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే 35,950 కోట్లకు మాత్రమే రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ తీసుకుంటామని తన సమాధానంలో పేర్కొన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా ప్రతివారం పోలవరం పేరుతో నాటి సిఎం చంద్రబాబు సవిూక్షించారు. ప్రతీ నెల నెలవారీగా ప్రాజెక్టు పనుల పురోగతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి నివేదిస్తోందని, 2019 జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు జరిగిన పనుల పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. ఈ క్రమంలో మరో ఏడాది కాలం పట్టేలా ఉంది. దీనికి సమాధానం ఇవ్వాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పోలవరం పై ప్రభుత్వ తీరును తాముఎప్పటికప్పుడు ఎత్తిచూపుతుంటే సద్విమర్వలుగా తీసుకోలేదన్నారు. ఇప్పుడు కేందరమేపనుల పురోగతిపై చెప్పినందుకు దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు.