ప్రభుత్వ పథకాలకు జగన్న పేర్లు


వివరాలు సమర్పించాలని ఆదేశాలు

ఎపి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

విచారణను పదిరోజులకు వాయిదా వేసిన ధర్మాసనం

 అమరావతి,డిసెంబర్‌9(జనంసాక్షి ): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న అన్ని పథకాలకు సీఎం జగన్‌ పేరు పెట్టడంపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  దాఖలైంది. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు పూర్తి నివేదక సమర్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మన్మథరావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి సీఎం జగన్‌ పేరు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ మద్దిపాటి శైలజ పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జగన్‌ తన పేరు పెట్టుకుని వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని పిల్‌లో పిటిషన్‌దారులు పేర్కొన్నాడు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సంక్షేమ పథకాల పేర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం, పెట్టిన పేర్లను పరిశీలించి నివేదిక అందజేయాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. అదేవిధంగా, కేంద్ర ప్రయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లను ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎస్‌కు రాసిన లేఖను అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు అందజేయాలని కూడా సూచించింది. అంతకుముందు, సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని ధర్మాసనం పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సదుద్దేశంతోనే ఈ పిల్‌ దాఖలు చేశామని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వ్యక్తిగతంగా పేర్లు పెట్టడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్రం సైతం తమ ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లు పెట్టుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని వివరించారు.

``````````````````