` రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
` కొత్త వేరియంట్ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్ వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నేడు సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలు..
పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.
పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించి.. అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలి.
బాధితుల నమూనాలకు ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలి. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి. రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలి. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి
ఒమిక్రాన్‌తో దేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా?
ప్రపంచ దేశాలను శరవేగంగా చుట్టేస్తోన్న ‘ఒమిక్రాన్’ మన దేశంలోనూ కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 236 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులతో పాటు కొవిడ్ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన ఆంక్షల్ని తెరపైకి తీసుకొచ్చాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రిపూట కర్ఫ్యూలు వంటివి అమలుచేయాలంటూ మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న వేళ ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఇలా..
మధ్యప్రదేశ్‌లో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ.. సీఎం వెల్లడి
ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడిరచారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాక రోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
దిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధాజ్ఞలు
దిల్లీలో కొవిడ్`19 కేసుల పెరుగుదలతో పాటు, ‘ఒమిక్రాన్’ సోకిన వారి సంఖ్య పెరగడంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాలపై నిషేధం విధిస్తూ నిన్న నిర్ణయం ప్రకటించింది. ఈ వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిని అనుమతించొద్దని వాణిజ్య సంఘాలను ఆదేశించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాల్లో పేర్కొంది. కొవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలుచేస్తేనే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించేందుకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. బార్‌లు రెస్టారెంట్లలో 50శాతం సిటింగ్ సామర్థ్యంతో అనుమతించనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు మాత్రం 200 మంది మించరాదని ఆంక్షలు విధించారు.
ముంబయిలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్
మహారాష్ట్రలోని ముంబయి నగరంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆరడుగుల భౌతికదూరం పాటించాలని స్పష్టంచేసింది. ఏవైనా వేడుకలు, సమావేశాలను 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని, కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. 200 కన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు నిర్వహించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరని తెలిపింది. మరోవైపు, ఇప్పటికే డిసెంబర్ 16 నుంచి 31వరకు ముంబయిలో అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తయినవారినే ప్రజా రవాణా సంస్థలు ప్రయాణానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్.. 9నగరాల్లో నైట్ కర్ఫ్యూ
ఒమిక్రాన్ వ్యాప్తి, రాబోయే పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడిరచింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భవ్‌నగర్, జామ్‌నగర్, జునాగఢ్‌లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలుకానుంది. ఆయా నగరాల్లో అర్ధరాత్రి దాకా 75శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పనిచేసేందుకు అనుమతి కల్పించారు.
కర్ణాటకలో బహిరంగ ప్రదేశాల్లో సామూహక వేడుకలు నిషిద్ధం
నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహక కార్యక్రమాలు చేపట్టరాదని, సామూహిక వేడుకలకు అనుమతిలేదని తెలిపింది. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగంపై నిషేధం విధించింది. కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై నిపుణులతో ఇటీవల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. వారి సిఫార్సుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడిరచారు. ‘‘డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నాం. పబ్‌లు 50శాతం సామర్థ్యంతో న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే అక్కడ డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదు. ఇక రెండు డోసుల టీకా తీసుకోనివారిని పబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతించొద్దు. అలాగే, అపార్ట్‌మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నాం’ అన్నారు.
రాత్రి కర్ఫ్యూ అమలు చేయండి