ఏటా తప్పని అమ్మకాల తిప్పలు
ఆదిలాబాద్,డిసెంబర్15 (జనంసాక్షి):- జిల్లాలోని పత్తి వ్యాపారుల వైఖరి కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులకు ధర దక్కకుండా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వ్యాపారులదే పైచేయిగా మారుతోంది. అక్టోబర్ మొదటి వారంలో జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. పంటలో తేమ శాతం రైతులకు శాపంగా పరిణమించింది. వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు రైతులకు తక్కువ ధర చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 శాతం పంట విక్రయాలు జరిగాయి. మద్దతు ధరలను ఒక్కోచోట ఒక్కో రకంగా అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు పంటను విక్రయానికి తీసుకొచ్చిన రైతులు నష్టపోవాల్సి వచ్చింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.పత్తి ధర పెరుగుతున్నా ఆదిలాబాద్ మార్కెట్‌లో మాత్రం పెరిగిన ధర ఇవ్వడానికి నిరాకరి స్తున్నారు. రైతుల పక్షాన అధికారులు పత్తి వ్యాపారులతో చర్చలు జరుపుతున్నా ఆరోజుకే పరిమితమవుతోంది. జిల్లాలో ఈ సారి పత్తి పంటను సాగుచేసిన రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సీజన్ ప్రారంభం నుంచి పంట దిగుబడులపై ఆశలు పెట్టుకున్న రైతులు చీడపీడలతో నష్టపోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది రైతులు పంటను ఒకటి రెండు సార్లు మాత్రమే తీశారు. ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి.
చిత్తవుతున్న పత్తి రైతులు