కవ్వాల్ రక్షణతో పులులకు భరోసా
కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు
నిర్మల్,డిసెంబర్6 ( జనంసాక్షి ) : అక్కడక్కడా ఇప్పుడు పులులను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చిరుతలు, పులుల సంఖ్య పెరుగుతోందన్న ఆనందం కన్నా అప్పుడప్పుడూ వాటిని హతమారుస్తున్న దుండగుల వ్యవహారం చూస్తుంటే వారు అడవిని కబళించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులు శాతం చాలా తక్కువ. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అనువైన వాతా వరణం కారణంగా క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. గతంలో వేటగాళ్ళు,స్మగ్లర్ల కారణంగా పెద్దపులులు ప్రాణాలు కోల్పోయాయి. రెండేళ్లక్రితం వరుసగా కవ్వాల్ అభయారణ్యంలోని పులులను హతమార్చారు. కవ్వాల్ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. వ్వాల్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అంటే..నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. ప్రతీ నాలుగేళ్లకోసారి కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రాష్టాల్లోన్రి పులుల సంఖ్యను లెక్కిస్తుంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి పోలిస్తే వీటి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 10 లేదా 12 పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పులులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నానీ చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పదుల సంఖ్యలో పులులు వేటగాళ్ల ఉచ్చులకు, స్మగ్లర్ల కుట్రలకు బలయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టి అటవీశాఖ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి నుంచి కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది. వనంతో పాటువన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత నిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు ఇలా అటవీ ప్రాంతాల న్నింటిలో పులులను అంచనా వేసేందుకు 2018 జూన్‌లో ఓ వారంపాటు అధ్యయనం జరిపారు. పులి పాదాల గుర్తులు, అడవుల్లో పెట్టిన కెమెరాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కించారు. ఏడాదిపాటు శాస్త్రీయ సర్వే చేసిన తర్వాత వివరాలు వెల్లడిరచారు. వాటి ప్రకారం.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పులుల సంఖ్య 68 ఉండగా, అప్పుడు తెలంగాణలో 20 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ అభయారణ్యంలో 3 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కవ్వాల్‌లో 10 నుంచి12వరకు పులులు ఉండొచ్చని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అడవులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు వేసిన సర్కారు వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే వారిని నియమించింది. జంగిల్ బచావో? జంగిల్ బడావో’నినాదంతో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. సీఎం సీరియస్‌గా ఇచ్చిన ఆదేశాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. అడవులతో పాటు ఇప్పుడు పులిని కూడా రక్షించాల్సిన అవసరం గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సీఎఫ్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో అభయారణ్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. అభయారణ్యంలోకి పులి రాకకు అడ్డంకులుగా మారుతున్న వాటిపై దృష్టిపెట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అభయారణ్యం పరిధిలో ఉన్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని రెండు అభయారణ్యాల్లో ఒకటైన మన కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది.