పార్లమెంటులో ఆగని టిఆర్‌ఎస్‌ ఆందోళనలు

  

సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి

డిమాండ్‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల వాకౌట్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : పార్లమెంట్‌ సాక్షిగా టిఆర్‌ఎస్‌ ఎంపిలు మరోమారు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ మేరకు లోక్‌సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం సృష్టించారు. ధానం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం తగదన్నారు. సమగ్ర ధాన్య సేకరణ విధానం తేవాలని ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ఎంపిలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉభయసభల నుంచి టిఆర్‌ఎస్‌ ఎంపిలు వాకౌట్‌ చేశారు. అలాగే మద్దతు ధరలపైనా ప్రకటన చేయాలన్నారు. ఈ సందర్బంగా సభ బయట పలువురు ఎంపిఉల మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చి అవాస్తవాలు చెప్పారని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యత తీసుకుంటుందన్నారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్‌ సప్లైస్‌ శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదంటూ పేర్కొన్నారు. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకుపోకుండా పంపలేదంటూ రాష్ట్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. రా రైస్‌, పార్‌ బాయిల్డ్‌ రైస్‌ కు తేడా తెల్వని వాళ్లు బీజేపీ ఎంపీలు కావడం మన దురదృష్టం అంటూ ఎద్దేవా చేశారు. పార్‌ బాయిల్డ్‌  విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ అని.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్ట లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్‌ బాయిల్డ్‌ బియ్యమేనని గుర్తుచేశారు. ఇప్పుడు వంద శాతం బియ్యం సేకరించమని తేల్చిచెప్పడం దుర్మార్గం అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదంటూ సూచించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవంటూ ఎంపిలు విమర్శించారు. రైతుల కోసం నిలబడేది, పోరాడేది టీఆర్‌ఎస్‌ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు.  వ్యవసాయ చట్టాల విూద రైతులే స్వయంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయట పోరాడుతున్నది టీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాలు కోసం పోరాడవన్నారు. కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని తెలిపారు. వ్యవసాయం ఉజ్వలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తుందన్నారు.